హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలపై దాడులు చేసి బంగారంతో ఉడాయిస్తున్నారు. నిఘా ఉంచిన పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో కాల్పులకు కూడా వెనకాడటం లేదు. తాజాగా సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు కలకలం రేపాయి. చైన్ స్నాచర్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంఖేశ్వర్ బజార్‌లో చైన్ స్నాచర్ సంచరిస్తున్నట్లు పోలీసులకు ఇన్‌ఫర్మేషన్ అందింది.
దీంతో వెంటనే అలర్ట్ అయిన యాంటీ డేకాయిటీ టీమ్ పోలీసులు శంఖేశ్వర్ బజార్ చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న చైన్ స్నాచర్ అమీర్‌ను పట్టుకునేందుకు పోలీసులు ట్రై చేశారు. అయితే అతను ప్రతిఘటించి పోలీసులపైనే ఎదురుదాడికి దిగాడు. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం పారిపోయే ప్రయత్నం చేయగా.. సినీ ఫక్కీ పోలీసులు అతడిని వెంబడించారు. లొంగిపోవాలని హెచ్చరిస్తూ గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. చివరికి అమీర్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.
కాగా, రెండ్రోజుల క్రితం సికింద్రాబాద్ చిలకలగూడలోనూ పోలీసులు కాల్పులు జరిపారు. సెల్‌ఫోన్ స్నాచింగ్ ముఠాను పట్టుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. దొంగల ముఠా వారిపోయే ప్రయత్నం చేయగా.. వారిని వెంబడించి మరీ పట్టుకున్నారు. మెుత్తం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.