తెలంగాణలో రాజకీయాలు రసకందాయకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కాగా.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనీసం ఖాతా కూడా తెరవలేని పరిస్థితికి చేరుకుంది. ఈ పరిమాణాలతో బీఆర్ఎస్ పార్టీలోకి కీలక నేతలు తట్టాబుట్టా సర్దేస్తూ.. కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచే ఈ ప్రక్రియ మొదలవగా.. లోక్ సభ ఎన్నికల తర్వాత ఊపందుకుంది. మొన్నటివరకు చోటామోటా నాయకులే వెళ్లారనుకుంటే.. ఇప్పుడు ఊహించని వ్యక్తులు షాకుల మీద షాకులిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ హస్తం తీర్థం పుచ్చుకున్నారు.
ఈ ఊహించని పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడు బలంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. 2004-06లోనూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నామని.. అప్పుడు తెలంగాణ ప్రజలు తీవ్రంగా స్పందించి ఆందోళనను ఉధృతం చేయడంతో చివరికి కాంగ్రెస్ తలవంచాల్సి వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. చరిత్ర మరోసారి పునరావృతమవుతుందంటూ కేటీఆర్ కీలక కామెంట్ చేశారు.
అయితే.. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారుగా.. ఆ విషయం గుర్తులేదా..? అని ప్రశ్నిస్తున్నారు. హిస్టరీ ఇప్పటికే రిపీటవుతోందని.. అది మీ విషయంలోనే అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
మరోవైపు.. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఘాటుగానే స్పందిస్తున్నాయి. గతం మర్చిపోయావా కేటీఆర్.. ఇప్పుడు వచ్చి నీతులు చెబుతున్నావ్.. అంటూ కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ వేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలోని డైలాగ్‌తో కేటీఆర్‌కు కౌంటర్ వేస్తూ.. ట్వీట్లు చేస్తున్నారు. "మా పార్టీ ఎమ్మెల్యేలను ఇతర పార్టీ వాళ్లు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం" అని కేటీఆర్ చేసిన కామెంట్‌ను కోట్ చేస్తూ.. సన్ ఆఫ్ సత్యమూర్తిలో.. "మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి.. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడటం కరెక్ట్ కాదు సర్.." అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్‌ను జోడించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. "అధికారాన్ని అడ్డుపెట్టుకొని పార్టీలను, ఎమ్మెల్యేలను చీల్చింది మర్చిపోయావా కేటీఆర్..? ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నావ్. ఇది కర్మఫలం.. ప్రతి ఒక్కరు అనుభవించక తప్పదు..!" అంటూ కాంగ్రెస్ నేతలు పోస్టులు పెడుతున్నారు.
![]() |
![]() |