తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల గ్యాప్లోనే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అందులో మొదటగా.. గులాబీ బాస్ కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాగా.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా హస్తం గూటికి చేరిపోయారు. అయితే.. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సంజయ్ పార్టీ మార్పును.. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో.. మొదటిసారిగా తాను పార్టీ మారటంపై డాక్టర్ సంజయ్ కుమార్ స్పందించారు.
జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చెప్పుకొచ్చారు. తమ ప్రాంతంలో చాలా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని.. వాటిని పూర్తి చేసేందుకే తాను అధికార కాంగ్రెస్ పార్టీలో చేరానని వివరణ ఇచ్చారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి రూ.80 కోట్ల నిధులు కావాలని.. వాటి కోసమే పార్టీ మారినట్లుగా సంజయ్ కుమార్ స్పష్టత ఇచ్చారు. వీటితో పాటు.. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసే బాధ్యత తనపై ఉందన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కావాలని.. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివరణ ఇచ్చారు.
అయితే.. సంజయ్ కుమార్ పార్టీ మారటంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ.. విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు సార్లు బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లటం కచ్చితంగా అవకాశవాదమేనంటూ మండిపడుతున్నారు. సంజయ్ చేరికతో.. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. సంజయ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నట్టుగా కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకపోవటంపై తీవ్ర మనస్తాపానికి లోనైనట్టు సమాచారం. దీంతో.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa