కరీంనగర్ ఎంపీగా వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ కుమార్ ఈరోజు పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణం చేసిన బండి సంజయ్.. ఈరోజు పార్లమెంట్‌లో లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్.. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
"గౌరవ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం..! ఈరోజు రెండోసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యునిగా ప్రమాణం చేసానంటే అది మీరందించిన చేయూత, మీరిచ్చిన బలం. నిరంతరం భారతమాత సేవలో నిమగ్నమయ్యేందుకు, వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నాకు రెండవసారి కూడా ఈ అవకాశాన్ని మీరందించారు. మీరిచ్చిన ఈ చేయూత జన్మజన్మలకు మర్చిపోలేనిది.
మీ ఆశలకు ప్రతిరూపంగా, మీ ఆశయాలను తీర్చుకునే వారధిగా నేను ఉపయోగపడతానని, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాను. మీ ఆశయాలకు అనుగుణంగా మసులుకొంటానని, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ, మీ సమస్యల పరిష్కారంలో ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
అలాగే ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు.. అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నన్ను కుటుంబంలో చిన్న కొడుకుగా ఆదరించి, అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను." అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు బండి సంజయ్.