ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళపైకి ఒకేసారి ఎగబడిన 15 కుక్కలు.. చివరివరకు ధైర్యంగా పోరాటం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 07:56 PM

హైదరాబాద్‌లో వీధి కుక్కలు రోజు రోజుకు రెచ్చిపోతున్నాయి. అప్పట్లో అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన.. అందుకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు ఇప్పటికీ మర్చిపోలేం. ఆ ఘటన గుర్తొచ్చినప్పుడల్లా.. ఒళ్లు గగుర్పొడవటమే కాకుండా.. మనుసు చివుక్కుమంటుంది. కన్నీళ్లు పెట్టించే ఆ ఘటన తర్వాత.. నగరంలో వీధి కుక్కల స్వైర విహారానికి సంబంధించి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కుక్కల దాడుల్లో చాలా మంది చిన్నారులు, పెద్దవాళ్లు గాయపడటమే కాదు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయిన విషాదకర సందర్భాలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా.. మణికొండలో జరిగిన ఘటన మరోసారి ఉలిక్కిపడేలా చేసింది.


మణికొండలో ఓ మహిళపైన ఏకంగా 15 వీధి కుక్కలు ఒకేసారి దాడికి తెగబడ్డాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు సుమారు అరగంటసేపు ఆ మహిళ.. శునకాలతో పోరాటమే చేసింది. అచ్చంగా సినిమాను తలపించేలా ఉన్న ఆ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. చిత్రపూరి కాలనీలో ఈరోజు (జూన్ 22న) ఉదయం 6 గంటల సమయంలో.. వాకింగ్ కోసం తన ఇంటి దగ్గర్లోని గ్రౌండ్‌కి స్కూటీపై వెళ్లిన ఓ మహిళ తన వాహనాన్ని పార్క్ చేసి ఒంటరిగా వెళ్తుండగా.. ఒక్కసారిగా వీధి కుక్కలు దాడికి ఎగబడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కుక్కల‌ు దాడి చేశాయి.


ఒక్కసారిగా అన్ని కుక్కలు దాడికి ఎగబడటంతో.. ఆ మహిళ గుండెలు జారిపోయాయి. చుట్టుముట్టిన ఆ కుక్కలను చూసి వెన్నులో వణుకు పుట్టినా.. చుట్టుముట్టిన శునకాలను వెళ్లగొట్టేందుకు సాయాశక్తులా ప్రయత్నించింది. రెండు చేతులా వాటిని తరిమికొడుతూ.. దాడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు యత్నించింది. సాయం కోసం అరుస్తూనే.. ప్రాణాలు కాపాడుకునేందుకు ధైర్యంగా వాటితో సుమారు అరగంటసేపు పోరాటం చేసింది. మధ్యలో.. ఆ మహిళ్ల ఒక్కసారిగా కుప్పకూలిపోగా.. ఆమెపైకి కుక్కలు గుంపుగా ఎగబట్టాయి. అయినా సరే.. ఆమె క్షణాల్లోనే ధైర్యాన్ని కూడగట్టుకుని మళ్లీ వాటిపై యుద్ధం కొనసాగించింది.


ఎంతసేపు వెళ్లగొట్టినా.. ఆ కుక్కలు దూరం వెళ్లినట్టే వెళ్లి మళ్లీ ఆమెపైకి వస్తున్నాయి. గాండ్రిస్తూ.. పైపైకి వస్తున్నాయి. అయినా ధైర్యాన్ని కోల్పోకుండా, గాయాలైనా పట్టించుకోకుండా.. ఆమె వాటితో పోరాడింది. చివరికి ఆ ప్రాంతానికి స్కూటీపై ఓ అబ్బాయి రాగా.. అదే సమయంలో మరో కారు కూడా రావటంతో.. అక్కడి నుంచి ఆ కుక్కలు వెనుదిరిగాయి. కుక్కలతో పోరాటంలో చివరికి ఆ మహిళే పైచేయి సాధించింది. చిన్న చిన్న గాయాలు మినహా ఆమెకు పెద్దగా గాయాలు కాకపోవటం ఊపిరిపీల్చుకునే అంసం.


కుక్కల దాడి.. వాటితో ఆమె పోరాటానికి సంబంధించిన సీసీకెమెరా వీడియోలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.. కుక్కల విషయంలో అధికారులపై మండిపడుతూనే.. శునకాల దాడిని ఎదుర్కొన్న ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ ఘటనపై బాధితురాలి భర్త స్పందిస్తూ.. మరో వీడియో విడుదల చేశారు.


కుక్కలు దాడి చేసింది తన భార్యపైనే అయినా.. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. తాము కూడా ఇంట్లో రెండు కుక్కలకు పెంచుకుంటున్నామని పేర్కొన్న ఆయన.. వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారికి కీలక సూచన చేశారు. కుక్కలపై ప్రేమ ఉంటే.. ఒకటో రెండో కుక్కలను ఇంటికి తీసుకెళ్లి పోషించాలని.. అలా కాదని ఆహారం మిగిలిందని చెప్పి వీధుల్లో కుక్కలకు పెడితే.. అవి గుంపులు గుంపులుగా మారి ఇలా దాడులు చేస్తున్నాయని వివరించారు.


తన భార్య పెద్దదే కాబట్టి ఆ కుక్కల దాడిని ధైర్యంగా ఎదుర్కుందని.. ప్రాణాలతో బయటపడిందని.. అదే స్థానంలో వేరే చిన్నపిల్లలు ఉండి ఉంటే.. పరిస్థితి ఎలా ఉండేందని ప్రశ్నించారు. ప్రాణాలతో చూసేవారిమా అని నిలదీశారు. కాబట్టి.. మానవత్వంతో ఆలోచించి.. వీధి కుక్కల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో.. అధికారులు కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు ఇంకేవరికీ జరగకుండా చూడాలని కోరారు.


వీధి కుక్కల దాడులు ఎన్ని జరగుతున్నా.. తమకేమీ పట్టనట్టున్న అధికారులు.. ఈ ఘటనను చూసైనా.. తమ అలసత్వాన్ని వదలాలని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇప్పటికైనా వీధి కుక్కలను నివారించే ప్రయత్నం చేసి.. జనాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై ఒంటరిగా నడవాలన్నా.. చేతుల్లో ఏవైనా ఆహారపదార్థాలు పట్టుకెళ్లాలన్నా.. రాత్రుళ్లో బండ్ల మీద వెళ్లాలన్నా.. వణికిపోవాల్సిన పరిస్థితి ఉందని.. ఇకనైనా అధికారులు మొద్దు నిద్రమాని.. కళ్లు తెరవాలని ఘాటుగా స్పందిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com