లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి, పొంగులేటి శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ కీలక నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో కుమారుడు భాస్కర్ రెడ్డితో కలిసి పోచారం హస్తం పార్టీలో చేరారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత స్థానం ఇస్తామని ప్రకటించారు. బాన్సువాడ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. తమకు అండగా ఉండాలని పోచారంను కోరామన్న సీఎం.. ఆయన అనుభవాన్ని తాము ఉపయోగించుకుంటామన్నారు.
రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్‌లో చేరా: పోచారం
కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైందని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా వ్యవహరిస్తోందన్న పోచారం.. రైతుల సంక్షేమం కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. గత ఆరు నెలలుగా రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గమనిస్తున్నానన్న పోచారం.. ఆయన్ను తన నివాసానికి ఆహ్వానించానన్నారు.
తాను పుట్టుకతోనే రైతును కాబట్టి.. రేవంత్ చేసే మంచి పనులు, రైతు సంక్షేమానికి అండగా ఉండాలనే ఆకాంక్షతో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మరో 20 ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం రేవంత్ రెడ్డికి ఉందన్నారు. పార్టీ మారడానికి రైతు సంక్షేమం తప్ప తాను ఏమీ ఆశించలేదన్నారు. తాను సొంతగూటికి తిరిగి రావడం ఆనందంగా ఉందని పోచారం తెలిపారు.
బాల్క సుమన్ అరెస్ట్..
పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే సమాచారం అందుకున్న బీఆర్ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నాయకత్వంలో పోచారం నివాసం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. రేవంత్ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని.. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పోలీసులు బాల్క సుమన్‌ను అరెస్ట్ చేశారు.
గులాబీ పార్టీకి షాక్..
కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ రివ్యూల్లో పాల్గొన్న ఆయన అకస్మాత్తుగా పార్టీ మారడాన్ని గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కొడుకు భవిష్యత్తు కోసమే ఆయన పార్టీ మారారని ప్రచారం జరుగుతోంది. పోచారంతో మొదలైన చేరికలు రానున్న రోజుల్లో మరింత ఊపందుకునే అవకాశం ఉంది.
2011లో కేసీఆర్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. 1994లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 నుంచి 2023 వరకు ఏడు పర్యాయాలు బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం.. మధ్యలో 2004 ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారు. తెలంగాణ వచ్చాక వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. కేసీఆర్ సర్కారు రెండో టర్మ్‌లో అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించారు.