తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భేటీ అయ్యారు. పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులతో కలిసి పోచారం నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడైన పోచారం శ్రీనివాస రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాలని వారు ఆహ్వానించారు. దీంతో వెంటనే పోచారంతోపాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2023 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆపరేషన్ గులాబీని చేపడుతోంది. బీఆర్ఎస్ పార్టీ నేతలకు వల విసురుతోన్న హస్తం పార్టీ.. కారు దిగి వచ్చే ఎమ్మెల్యేలు, నేతలకు వెల్‌కమ్ చెబుతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోవడంతో.. ఆ పార్టీలో సీనియర్ నేతలుగా కొనసాగుతున్న వారు.. తమ దారి తాము చూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం నివాసానికి వెళ్లి కలవడం.. ఆ వెంటనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
కేసీఆర్ లక్ష్మీపుత్రుడు పోచారం..
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్)తో సన్నిహితంగా మెలిగే నేతల్లో పోచారం శ్రీనివాస రెడ్డి ఒకరు. అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్వహించిన ప్రచార సభలో పోచారంపై కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు అనేక సార్లు తాను బాన్సువాడకు వచ్చానన్న కేసీఆర్.. ఆరోజు తాము పిడికెడు ముందే ఉన్నామన్నారు. అన్ని నియోజకవర్గాల కంటే బాన్సువాడలో ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు. పోచారం ఎక్కడ అడుగుపెట్టిన లక్ష్మీ తాండవించినట్టుగా పని జరిగేదన్న కేసీఆర్.. ఏ పని మొదలుపెట్టినా శుభప్రదం అయ్యేది, రిజల్ట్ బాగా వచ్చేదన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి తాను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టానని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
1994లో తొలిసారి ఎమ్మెల్యేగా..
1994, 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో మరోసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం.. 2011లో తెలంగాణ ఉద్యమానికి మద్దతునివ్వడం కోసం టీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో గెలిచిన ఆయన.. 2014, 2018, 2023 ఎన్నికల్లోనూ బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
వ్యవసాయ మంత్రి, స్పీకర్‌గా సేవలు..
తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ తొలి టర్మ్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. 2018 ఎన్నికల తర్వాత అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసినవారు ఎన్నికల్లో ఓడిపోతారనే సంప్రదాయానికి ముగింపు పలుకుతూ 2023 ఎన్నికల్లో ఆయన 23 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచారు.