స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అనే సంగతి తెలిసిందే. మార్కెట్‌ను సునిశితంగా ఫాలో అవుతూ.. నిపుణుల సూచనల మేరకు స్టాక్స్‌లో పెట్టుబడితే మంచి లాభాలు వస్తాయి. అదే తెలిసీ తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఉన్నదంతా ఊడ్చుకొని పోతుంది. దీంతో స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ సూచనలతో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇదే అదనుగా సైబర్ కేటుగాళ్లు మోసం చేసేందుకు కాచుకొని ఉంటున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలతో సోషల్ మీడియాలో వల వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.
ఇటీవల హైదరాబాద్ నగరంలో సైబర్ ఫ్రాడ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లి జేఎన్టీయూ సమీపంలోని వసంత్ నగర్‌లో నివసించే నరేశ్ అనే యువకుడు నగరంలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి.. ఇండోర్‌కు చెందిన ‘ఎసెన్స్ ఇన్వెస్ట్‌మెంట్’ అనే కంపెనీ ప్రకటనను చూసి వారిని అప్రోచ్ అయ్యాడు. తమ దగ్గర పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని, కొంత కమీషన్ మినహాయించుకొని మిగతా మొత్తం మీకు తిరిగి ఇచ్చేస్తామని వారు అతణ్ని నమ్మించారు.
ఆ కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి పరిశీలించిన నరేశ్ అందులో కంపెనీ ఇండోర్ అడ్రస్‌తోపాటు మెయిల్ ఐడీ, సెబీ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉండటంతో నమ్మేశాడు. సదరు కంపెనీ ప్రతినిధుల సూచన మేరకు నరేశ్ విడతల వారీగా రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. కొంత లాభాలు వచ్చాక డబ్బులు వెనక్కి తీసుకునేందుకు సిద్ధపడగా.. అప్పుడే తీసేయొద్దు, మరికొంత ఇన్వెస్ట్ చేయండి.. ఇంకా మంచి లాభాలు వస్తాయంటూ ఒత్తిడి తెచ్చారు. కళ్ల ముందే లాభాలు వచ్చినట్టు కనిపిస్తుండటంతో.. వారి మాటలు నమ్మిన నరేశ్ మరో రూ.8 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. వాళ్లు చెప్పినట్టే రూ.18 లక్షల పెట్టుబడి కాస్తా రూ.28 లక్షలయ్యింది. మంచి లాభం వచ్చింది కాబట్టి.. కొంత కమీషన్ వారికి ఇచ్చేసి మిగతా డబ్బులు డ్రా చేసుకుందామని నరేశ్ భావించాడు.
ఇదే విషయం వారికి చెప్పగా.. అలాగే చేద్దురు గానీ. అయితే డబ్బులు డ్రా చేసుకోవడానికి రూ.3 లక్షలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అప్పుడే మీరు డబ్బులు తీసుకోవడం కుదురుతుందని చెప్పారు. దీంతో వారు అడిగిన మొత్తాన్ని ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా నరేశ్ చెల్లించాడు. ఆ తర్వాత చూస్తే అప్పటి దాకా నరేశ్‌తో టచ్‌లో ఉన్న ఫోన్ నంబర్ స్విచ్ఛాప్ అయ్యింది. వాట్సప్ ద్వారా వారిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించగా కుదరలేదు.
పది రోజులపాటు ప్రయత్నించాక.. తాను మోసపోయానని గుర్తించిన నరేశ్ ఆన్‌లైన్ ద్వారా కేంద్ర సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. అంతకు ముందే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగింది చెప్పగా.. లక్ష రూపాయలకు మించిన మొత్తం కావడంతో తాము ఫిర్యాదు తీసుకోలేమని.. నేరుగా కమిషనరేట్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. దీంతో బాధితుడు చివరకు సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు.
కష్టపడి సంపాదించిన డబ్బుతోపాటు పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేసిన సొమ్ము కూడా సైబర్ నేరగాళ్ల పాలు కావడంతో మనస్థాపానికి గురైన అతడు.. తన డబ్బు వెనక్కి వచ్చే మార్గాలను వెతుకుతూ ‘సమయం’ను సంప్రదించాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నాడు. సైబర్ నేరగాళ్ల ఆటకట్టించడంలో చురుగ్గా ఉండే తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి డబ్బులు వెనక్కి ఇప్పిస్తే అతడికి అంతకు మించిన ఊరట ఇంకేమీ ఉండదు.