ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాలువాలు కప్పకండి.. ఎందుకు పనికిరావు, వాటికి బదులు.. మంత్రి పొన్నం ప్రభాకర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 07:20 PM

సమాజంలో ఎవరైనా పెద్దలను, పేరున్న వ్యక్తులను కలిసినప్పుడో.. అతిథులను గౌరవించేందుకో.. లేదా ఎవరినైనా అభిమానం తెలిపేందుకో, సన్మానించేందుకో.. ఇలా పలు సందర్భాల్లో శాలువాలు కప్పే సంప్రదాయం ప్రస్తుతం అలవాటులో ఉంది. అన్ని రంగాల్లో ఈ సంప్రదాయం ఉంది. అందులోనూ ముఖ్యంగా రాజకీయాల్లో చాలా ఎక్కువగా నడుస్తోంది. పీఎం నరేంద్ర మోదీ దగ్గరి నుంచి మొదలుపెడితే గల్లీ నాయకుడి వరకు.. ఎవరిని కలిసేందుకు వెళ్లినా ఓ చేతిలో పూల బొకే, ఇంకో చేతిలో శాలువా ఉండాల్సిందే.


ఒక్కోసారి బొకే స్థానంలో చిన్న చిన్న మొక్కలు కూడా ఇస్తుంటారు లేదా విగ్రహాలు, ఫొటో ఫ్రేమ్‌లు ఇలా రకరకాల జ్ఞాపికలు ఇస్తుంటారు.. కానీ ఏదిచ్చినా శాలువా మాత్రం కామన్‌గా వస్తుంటుంది. అది గౌరవప్రదమైన సంప్రదాయమైనా.. ఇప్పుడది ప్రొటోకాల్‌లా మారిపోయిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే.. ఈ శాలువాలు కప్పే సంప్రదాయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్న వారికి తనదైన శైలిలో విలువైన సూచనలు చేశారు.


"దయచేసి కాటన్‌ని ప్రోత్సహించండి.. చేనేత రంగాన్ని కాపాడండి. తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిధులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే.. శాలువాలకు బదులు కాటన్ టవల్స్‌తో సత్కరించండి. అవి.. వాళ్లకు ఉపయోగపడతాయి.. వేరే వాళ్లకు ఇచ్చిన పనికొస్తాయి.. వాటిని తయారు చేస్తున్న నేతన్నలను ప్రోత్సహించినట్టు అవుతుంది. కాటన్ టవల్స్ ఇవ్వండి.. లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు, పెన్నులు ఇవ్వండి. అంతేకానీ.. ఇలాంటి శాలువాలు కప్పుకోకపోతేనేమో.. అమర్యాదపర్చినట్టవుతుంది. కప్పుకుంటే ఎందుకు పనికిరావు.. బయట ఎవరికైనా ఇద్దామంటే కూడా ఎవరికీ ఉపయోగపడేది కాదు.. ఇది ప్లాస్టిక్‌తో సమానం." అంటూ పొన్నం ప్రభాకర్ వివరించారు.


"నాకే కాదు.. ఎవరి దగ్గరకు వెళ్లినా.. మంత్రుల దగ్గరకు వెళ్లినా, అధికారుల దగ్గరికి వెళ్లినా, పెద్దలకు గౌరవించాలన్నా.. కాటన్ టవల్స్ ఇవ్వండి. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి చేనేత కార్మికులకు ఉపయోగపడినట్టు అవుతుంది. వాటిని ఎవరికైనా దానం చేసినా ఉపయోగపడుతుది కాబట్టి.. ఈ శాలువాలను వాడటం మానేసి.. కాటన్ టవల్స్‌ను ప్రోత్సహించండి." అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తన విలువైన సూచనలు చేశారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com