తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీడబ్యూసీ మీటింగ్‌కు అగ్రనేతలంతా హాజరయ్యారు. దేశంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి.. బీజేపీని ఎలా ఎదుర్కోవాలి.. అన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా.. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రధానంగా ఈ మీటింగ్‌లో చర్చించనున్నట్టు సమాచారం. అయితే.. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలను పార్టీ కేడర్‌లో నింపాలన్న ఉద్దేశంతో.. ఈ ప్రతిష్ఠాత్మక మీటింగ్‌ను సుమారు 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ సమావేశాలకు సోనియా గాందీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తో పాటు మల్లికార్జున ఖర్గే ఇలా పార్టీలో పెద్దలంతా హాజరయ్యారు. కాగా.. ఈ సమావేశానికి వచ్చిన అతిథులకు అదిరిపోయే విందు ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు.
ఈ విందులో తెలంగాణ ప్రత్యేక వంటకాలతో పాటు హైదరాబాద్‌కు ఫేమస్ అయిన దమ్ బిర్యానీని కూడా ఉంచారు. బిర్యానీ, మటన్, తలకాయ కూర, ఇలా మొత్తంగా 78 రకాల వెరైటీ వంటకాలను మెనులో పెట్టారు. ఉదయం టిఫిన్ నుంచి మొదలు.. రాత్రి భోజనం వరకు అన్ని రకాల నోరూరించే వంటకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక వంటకాల కోసం తెలంగాణలోని చేయి తిరిగిన నలభీములతో పాటు.. వివిధ ప్రాంతాల నుంచి వంట మనుషులను రప్పించినట్టు తెలుస్తోంది.
మెనూలో ఉన్న వంటకాలివే..
అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, పెసరట్టు, ఉగ్గాని, రాగి, జొన్న సంగటి, కిచిడీ, పాయా సూప్, ఖీమా రోటీ, మిల్లెట్ వడ, మిల్లెట్ ఉప్మా, ప్రూట్ సలాడ్ వంటివి వడ్డించారు.
మధ్యాహ్నం భోజనంలో హైదరాబాదీ దమ్ బిర్యానీ, బగారా రైస్, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, గోంగూర మటన్, చింతచిగురు మటన్, మటన్ కర్రీ, దాల్చా మటన్, తలకాయ కూర, స్పెషల్ చికెన్, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, హలీమ్, కుర్మా, చేపలు వడ్డించారు.
వెజ్ తినే వారి కోసం గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, గోంగూర చట్నీ, పచ్చి పులుసు, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్లు వడ్డించారు.
ఇక.. స్నాక్స్ ఐటమ్స్‌గా ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సర్వపిండి, వివిధ రకాల సమోసాలు, కుడుములు, మురుకులు, ఉడికించిన మొక్కజొన్న, సకినాలు, గారెలు రుచి చూపించారు.
ఇక రాత్రి భోజనంలోనూ.. చపాతీలు, పుల్కాలు, నాన్‌లతో పాటు మధ్యాహ్నం మెనూలో ఉన్న వెరైటీలను రిపీట్ చేయనున్నట్టు తెలుస్తోంది.