తెలంగాణలో చరిత్రలో మరో అపురూప ఘట్టాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో గులాబీ బాస్ కేసీఆర్ ప్రసంగించారు. ఒకప్పుడు పాలమూరు బిడ్డ హైదరాబాద్‌లో అడ్డా కూలీగా ఉండేవాడని.. కానీ ప్రస్తుతం పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి పనులు చేస్తున్నారని తెలిపారు. పాలమూరు బిడ్డల మారిన ముఖచిత్రానికి ఇది నిదర్శనమని కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలో.. గత పాలకులపై సీఎం కేసీఆర్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 1954లో ఆర్డీఎస్ కట్టారని.. దాన్ని కూడా ఆనాటి ఆంధ్రా పాలకులే నాశనం చేశారని కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఆర్డీఎస్ తూములు మూసేస్తే.. మళ్లీ బాంబులు పెట్టి ఆర్డీఎస్ బద్దలు కొడుతామని ఆంధ్రాపాలకులు బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. ఆ మాటలు విని.. సుంకేశుల బ్యారేజీ వద్ద ఉన్న తనకు రక్తం మరిగిందని.. ఆ మాట అన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని బెదిరించినట్టు గుర్తు చేశారు.
ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు.. అక్కడ అడుగు పెడితే.. సుంకేశుల బరాజ్‌ను 100 బాంబులు పెట్టి లేపేస్తాను అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ధమ్కీ ఇచ్చానని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ ప్రకటనను పాలమూరు ప్రజలు తప్పుగా తీసుకోలేదని.. తమకు కూడా బాంబు వేసే మొనగాడు పుట్టాడని గర్వంగా భావించారన్నారు. ఎప్పటికైనా తమకు నీళ్లు వస్తాయని సంతోషపడ్డారని చెప్పుకొచ్చారు. కానీ.. తాము ఎలాంటి బాంబులు వేయలేదు కానీ.. ఇంటి దొంగలే ప్రాణగండమయ్యారని పేర్కొన్నారు. ప్రాజెక్టులను అడ్డుకున్నారని చెప్పారు. నాటి ముఖ్యమంత్రులను చూస్తే వారికి లాగులు తడిసిపోయేవన్నారు. పదవులకు భయపడి ఆనాడు సమైక్య పాలకులను ప్రశ్నించలేకపోయారని చెప్పుకొచ్చారు.
ప్రాజెక్టులు ఎలా కడుతావు.. పాలమూరు పైన ఉంది కదా.. అని నాటి నాయకులు తనని ప్రశ్నించినట్టు గుర్తు చేసిన కేసీఆర్.. నీళ్లు కిందకు లేవు వెదవా.. మీ మెదడే మోకాళ్లలో ఉందని బదులిచ్చినట్టు చెప్పుకొచ్చారు. వాళ్లు ఇప్పుడు కూడా బతికే ఉన్నారని తెలిపారు. అయితే.. పాలమూరు లిఫ్ట్ పొంగును చూస్తుంటే.. కృష్ణమ్మ తాండవం చేసినట్లు ఉందని వర్ణించారు. ఆ దృశ్యాన్ని చూసి తన ఒళ్లంతా పులకరించి పోయిందన్నారు. తన జీవితం ధన్యమైందన్నారు కేసీఆర్.