తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క స్త్రీకి ప్రభుత్వం బతుకమ్మ చీర అందిచనుంది. కాగా, చీరల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 351.52 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో సగటున కోటి మందికి బతుకమ్మ చీరలు అందించనున్నారు. బతుకమ్మ పండుగకు వారం ముందు వీటిని పంపిణీ చేస్తారు.
బతుకమ్మ చీరల తయారీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది చేనేత కార్మికులు ఉపాధి పొందారు. రంగు రంగుల వన్నెల్లో, కలర్ ఫుల్ రంగులతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో నేయించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహిళా లబ్దిదారులకు భారీగా పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు మరింత ఆకర్షణీయంగా వెండి, బంగారు, జరీ అంచులతో తయారు చేయించారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ప్రతి బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడబిడ్డలకు రంగు రంగుల డిజైన్లలో చీరలు ఉచితంగా అందిస్తోంది.