గతేడాది రణ్ బీర్ - ఆలియా, నయన్ - విఘ్నేష్, హన్సిక, నాగశౌర్య వంటి స్టార్ సెలెబ్రిటీలు వివాహజీవితంలోకి అడుగుపెట్టగా, తాజాగా ఈ ఏడాది స్టార్ డైరెక్టర్ పెళ్లిపీటలెక్కారు. ఆయనెవరో కాదు.. వరుణ్ తేజ్ కు 'తొలిప్రేమ' వంటి సూపర్ హిట్ అందించిన వెంకీ అట్లూరి. పూజా అనే అమ్మాయితో గతేడాది నిరాడంబరంగా నిశ్చితార్ధం జరుపుకున్న వెంకీ ఈరోజు ఆమెను వివాహం చేసుకున్నారు. వెంకీ వివాహానికి హీరో నితిన్ సతీమణి షాలినీతో సహా హాజరయ్యారు. ఇంకా హీరోయిన్ కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా హాజరైనట్టు తెలుస్తుంది.
జ్ఞాపకం సినిమాతో 2007లో సినీ ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమైన వెంకీ అట్లూరి ఆపై స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రాలకు డైలాగులు అందించారు. స్నేహగీతం సినిమాలో హీరోగా కూడా నటించారు. తొలిప్రేమతో దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి ఆపై మిస్టర్ మజ్ను, రంగ్ దే చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం ధనుష్ తో 'సార్ / వాతి' సినిమాను రూపొందిస్తున్నారు. వచ్చే నెల 17న ఈ సినిమా విడుదల కావడానికి తయారవుతుంది.