ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరివెన్నెలకి జయంతి నివాళులు -- పవన్ కళ్యాణ్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 03:35 PM

పవన్ కళ్యాణ్ , సిరివెన్నెలతో తనకున్న సన్నిహితాన్ని ఈయన జయంతి సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు. తను భౌతికంగా లేకపోయినా తను సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తాడు. పంచ భూతాలలో కలసిపోయినా రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అలాంటి ఒక గొప్ప కవి శ్రీ 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి గారు. ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి. శ్రీ సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా విడుదలైన 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం ' మొదటి సంపుటి చూశాక - ఆ అక్షర తపస్విని మొదటిసారి 'రుద్రవీణ' సినిమా సమయంలో కలసిన సందర్భం గుర్తుకు వచ్చింది. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ఈ సినిమాకు నాగబాబు అన్నయ్య నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి నేను సహ నిర్మాతగా ఉంటూ నిర్మాణంలో పాలుపంచుకొన్నాను. ఆ సందర్భంలో శ్రీ శాస్త్రి గారితో భేటీ ఆయ్యేవాణ్ణి. ఆ చిత్రంలో 'చుట్టూపక్కల చూడరా చిన్నవాడా' పాటలో చివరి చరణం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది/ గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది/ ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా / తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే - అనే ఈ పంక్తులు నన్నెంతో ప్రభావితం చేశాయి. ఇప్పటికీ నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. నన్ను నిలబెట్టిన ఈ సమాజానికి రుణం తీర్చుకోవడం నా విధిగా భావిస్తాను. జనసేన పార్టీ పక్షాన కౌలు రైతులకు భరోసా ఇచ్చి ఆర్థిక సాయం చేయడం కూడా నా బాధ్యతే. మనకున్నది పదిమందికీ పంచాలి - అది ప్రకృతి ధర్మం అనే విషయాన్నీ రుద్రవీణలోని 'తరలిరాద తనే వసంతం..' అనే పాటలో వినిపించారు. 'పంచే గుణమే పోతే - ప్రపంచమే శూన్యం/ఇది తెలియని మనుగడ కథ -దిశనెరుగని గమనము కద' అనే పంక్తులలోని భావాన్ని అందరం తెలుసుకోవాలి. ఏరు దాటాకా అవసరం తీరిందని తెప్ప తగలబెట్టే ఆలోచనలతో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వారు ఒకసారి శ్రీ శాస్త్రి గారి సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి. శ్రీ సీతారామ శాస్త్రి గారు రచనలన్నిటిలో కవిగా ఆయనలోని సామాజిక బాధ్యత కనిపిస్తుంది. సమాజానికి బాధ్యతలు గుర్తు చేసే దృక్పథం అందులో నిక్షిప్తమై ఉంటుంది. ఆయన అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు. శ్రీ శాస్త్రి గారి రచనలలోని గాఢతను చెబుతూ కవిగా ఆయన్ని మరింత అర్థం చేసుకొనేలా చేశారు శ్రీ త్రివిక్రమ్ గారు. ఆయనకు నా కృతజ్ఞతలు. 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం ' అందిస్తున్న 'తానా' బృందానికి నా హృదయపూర్వక అభినందనలు అని తెలియచేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com