ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్టప్రతి వద్దకు తమిళ రాజకీయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 02:14 AM

- ప్రణబ్‌ను కలిసి పరిస్థితులు వివరించనున్న డీఎంకే నేత స్టాలిన్‌


 -శశికళకు జీవిత ఖైదు పడొచ్చని  స్టాలిన్‌ వ్యాఖ్య


 -చిన్నమ్మ జైలులో బానే ఉన్నారు:  అన్నాడీఎంకే నేతలు


 -కొత్త పార్టీ ప్రకటించనున్న దీపా 


చెనై్న: అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలపై తమిళనాడులో రాజకీయ వేడి ఇంకా కొనసాగుతోంది. తమిళ రాజకీయాలు రాష్టప్రతి ప్రణబ్‌ ముఖర్జీ వద్దకు వెళ్లనున్నాయి. డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ పార్టీ నేతలతో ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావును కలిసి బలపరీక్ష సమయంలో తమపై వ్యవహరించిన తీరును వివరించిన స్టాలిన్‌.. తాజాగా రాష్టప్రతి ప్రణబ్‌ ముఖర్జీని కలుసుకుని ఇటీవల అసెంబ్లీలో సీఎం పళనిస్వామి విశ్వాసపరీక్ష సందర్భంగా తలెత్తిన పరిస్థితులను వివరించనున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే సభను సజావుగా సాగిస్తూ కేవలం అన్నాడీఎంకే నేతలతోనే స్పీకర్‌ విశ్వాసపరీక్ష నిర్వహించడంపై రాష్టప్రతికి స్టాలిన్‌ ఫిర్యాదు చేయనున్నారు. విశ్వాసపరీక్షను నిరసిస్తూ చెనై్నలో స్టాలిన్‌ బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. అసెంబ్లీ స్పీకర్‌ ధన్‌పాల్‌ తీరును స్టాలిన్‌ సహా డీఎంకే ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. జయలలిత మృతి చెందిన తీరుపై సరైన రీతిలో విచారణ జరిపితే.. ఇప్పుడు నాలుగేళ్ల జైలుశిక్ష మాత్రమే అనుభవిస్తున్న శశికళకు జీవిత ఖైదు పడొచ్చని స్టాలిన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.   ఇదిలాఉండగా ఇప్పుడ్పిపుడే జైలు వాతావరణాన్ని చిన్నమ్మ శశికళ అలవాటు చేసుకుంటున్నారని అన్నాడీఎంకే కర్ణాటక విభాగం కార్యదర్శి వీ పుగాజెండి తెలిపారు. అయితే, ఆమె వయోభారం రీత్యా కొన్నిప్రత్యేక సౌకర్యాలు అవసరం అని చెప్పారు. వాటికోసం మరోసారి కూడా దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం బెంగళూరులోని జైలులో శశికళ ఉంటున్న విషయం తెలిసిందే. తనకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటుచేయాలని చేసుకున్న వినతికి కోర్టు నిరాకరించింది. అయితే, తనకు ఓ టేబుల్‌ ఫ్యాన్‌, మంచి పరుపునైనా అనుమతించాలని, తన ఆరోగ్యం, వయసు రీత్యా అవి అవసరం అని మరోసారి తన పిటిషన్‌లో పేర్కొన్నారట. చిన్నమ్మ బాగున్నారు. కాకపోతే కాస్తంత నీరసంగా ఉన్నారు. ఆమె షుగర్‌ లెవల్‌, రక్తపోటు సాధారణంగానే ఉంది. ఇప్పుడిప్పుడే ఆమె జైలు వాతావరణానికి తగినట్లుగా సర్దుకుంటున్నారు. వయసు, ఆరోగ్యం దృష్టా్య చిన్నచిన్న సౌకర్యాలకోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అవి ఆమెకు అందుతాయని నేను ఆశిస్తున్నాను. ఆమెను చెనై్నలోని కేంద్ర కారాగారంలోకి తరలించేంత వరకు ఎటాచ్‌ బాత్‌రూమ్‌తో కూడిన సెల్‌, ఒక మంచం, పరుపు, ఒక టేబుల్‌ ఫ్యాన్‌లాంటివి ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె విజ్ఞప్తి సరైనదే అని కూడా పుగాజెండి చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి త్వరలోనే న్యాయవాదులతో జైలు వద్దకు వచ్చి ఆమెను చెనై్న తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. గతంలో కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న అనుభవం శశికళకు ఉందని చెప్పారు. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపాజయకుమార్‌ కొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. జయలలిత పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం కొత్తపార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. తన రాజకీయ ఆరంగేట్రంపై ఫిబ్రవరి 24న ప్రకటిస్తానని, అప్పటి వరకు ఎలాంటి వదంతులు నమ్మవద్దని దీపా గతంలోనే ప్రకటించారు. ఈ మేరకు దీపా తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వనున్నారు. జయలలిత మృతిపై దీపా జయకుమార్‌ పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీపై శశికళ ఆధిపత్యాన్ని దీపా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శశికళ తీరుపై ఆమె బహిరంగంగానే విమర్శించారు. శశికళకు వ్యతిరేక వర్గమైన పన్నీరు సెల్వంతో కలిసి దీపా కొత్త పార్టీని స్థాపిస్తారా? లేక సొంతంగానే కొత్తపార్టీని ప్రకటిస్తారా? అనే చర్చ జరుగుతోంది. జయలలిత మృతితో చెనై్నలోని ఆర్కేనగర్‌ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఆర్కేనగర్‌ నియోజకవర్గం నుంచి దీపా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఈ స్థానం నుంచి పోటీ చేసి మంత్రిపదవి చేపట్టాలని శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. జయలలిత మేనకోడలు దీపాను తమిళ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com