ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నప్పుడు టీచర్ కొట్టిందనే పగతో పెద్దయ్యాక హత్య

international |  Suryaa Desk  | Published : Fri, Mar 18, 2022, 03:27 PM

విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచేందుకు టీచర్లు ప్రయత్నిస్తుంటారు. వారికి నయానోభయానో విద్యాబుద్ధులు నేర్పిస్తుంటారు. సొంత పిల్లలు కంటే తమ వద్ద చదువుకున్న విద్యార్థులు మంచి స్థానాల్లో ఉంటే సంతోషంతో ఉప్పొంగిపోతారు. ఇలా తన చిన్నతనంలో టీచర్ తనను కొట్టిందని ఓ వ్యక్తి పగతో రగిలిపోయాడు. 30 ఏళ్ల తర్వాత ఆ టీచర్ ఎక్కడుందో తెలుసుకుని దారుణంగా హత్య చేశాడు. దీనికి సంబంధించిన విషయాలిలా ఉన్నాయి.


బెల్జియం దేశానికి చెందిన 37 ఏళ్ల గుంటెర్ ఉవెంట్స్ 1990లో ఓ స్కూలులో ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించాడు. ఆ సమయంలో వెర్లిండన్ అనే మహిళ టీచర్‌గా పని చేసేవారు. సరిగ్గా చదవడం లేదని, అల్లరి చేస్తున్నాడని ఆ సమయంలో గుంటెర్‌ను అతని టీచర్ వెర్లిండన్ కొట్టారు. స్నేహితుల ముందు తనను కొట్టడంతో చిన్నతనంలోనే అవమానంగా ఫీల్ అయ్యాడు. తనకు 35 ఏళ్లు వచ్చినా ఏడేళ్ల వయసులో ఎదురైనా అనుభవాన్ని మర్చిపోలేదు. 2020లో ఆంట్‌వెర్ప్ నగరం సమీపంలోని హెరెంటల్స్‌లో తన టీచర్ వెర్లిండన్(59) ఉంటున్నట్లు తెలుసుకున్నాడు. ఓ రోజు అదును చూసుకుని, వారి ఇంటికి వెళ్లి టీచర్‌ను కత్తితో విచక్షణా రహితంగా 101 సార్లు పొడిచాడు. ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంట్లో వస్తువులు, డబ్బు పోకపోవడంతో దొంగల పని కాదని పోలీసులు భావించారు. ఏ కోణాల్లో విచారణ చేపట్టిన నిందితుడు దొరకలేదు. అయితే తన టీచర్‌కు తగిన శాస్తి చేసినట్లు ఇటీవల తన స్నేహితుడితో గుంటెర్ చెప్పాడు. ఇది విన్న అతని స్నేహితుడు విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. మంగళవారం జడ్జి ముందు ప్రవేశపెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com