ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పది గంటల నరకయాతన అనంతరం సురక్షితంగా బయటకు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2017, 08:26 AM

ఆ బాలుడు మృత్యుంజయుడయ్యాడు. బోరుబావిలో చిక్కుకున్న ఆ చిన్నారి దాదాపు పదిగంటల పాటు మృత్యువుతో పోరాడాడు. సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది మంగళవారం అర్ధరాత్రి దాటాక 2.40 గంటల ప్రాంతంలో అతడిని బయటకు తీశారు. ఆ బాలుడు రెండు చేతులు వూపాడు. ఓ వైపు వర్షం కురుస్తున్నప్పటికీ సహాయ సిబ్బంది చేపట్టిన నిర్విరామ కృషి ఫలించింది. పసిప్రాణాన్ని కాపాడింది. క్షణక్షణం ఉత్కంఠతో పాటు భయాందోళనను రెట్టింపు చేసిన మృత్యుగుంతపై చివరికి మానవ ప్రయత్నమే విజయం సాధించింది. బయటకు వచ్చిన వెంటనే చిన్నారికి కొద్దిగా నీరు తాగించారు. అనంతరం 108 వాహనంలో వైద్యులు, సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. కళ్లలో వత్తులు వేసుకుని వేసి చూస్తున్న ఆ తల్లిదండ్రుల ఆనందానికి ఆవధుల్లేకుండా పోయింది.


ఈ సందర్భంగా తల్లి అందరికీ నమస్కారం పెడుతూ... ‘దేవుడున్నాడయ్యా...’ అని పేర్కొన్నారు. ఆ తండ్రి... ‘నా బిడ్డ బతికాడయ్యా... అందరికి దండం..’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. సహాయ చర్యలను పర్యవేక్షించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... ‘ఇది అద్భుతమైన సంఘటన. సమష్టి విజయం. పసివాడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి కృషి చేసి అందరికీ అభినందనలు’ అన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ (ఏడాదిన్నర వయసు) మంగళవారం సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో బోరుబావిలో పడిపోయాడు. బాలుడ్ని జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు దాదాపు పది గంటల పాటు శ్రమించి సురక్షితంగా వెలికితీశారు. బోరుబావికి సమాంతరంగా 30 అడుగుల మేర గొయ్యి తవ్వారు. చిన్నారి బోరుబావిలో 15 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో సమాంతరంగా తవ్విన గొయ్యి వైపు నుంచి బోరుబావికి 22 అడుగుల లోతులో రంధ్రం చేశారు. బాలుడు భయపడకుండా ఉండటానికి బోరుబావిలోకి చరవాణిని పంపి కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. యంత్రాంగం యావత్తు చివరి వరకు వానను లెక్క చేయక చర్యలను చేపట్టారు.


ఏం జరిగిందంటే...: గ్రామానికి చెందిన మల్లికార్జునరావు భార్య అనూష కుమారుడిని తీసుకుని సాయంత్రం మూడింటి సమయంలో పొలానికి వెళ్లింది. ఏడాది కిందట పొలంలో వేసిన బోరులో నీరు పడకపోవడంతో కేసింగ్‌పైపుతో సహా అలాగే వదిలేశారు. దానికి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. తల్లి గడ్డి కోస్తుండగా సుమారు వంద అడుగుల లోతున్న బోరు పక్కనే చిన్నారి ఆడుకుంటూ అందులో పడిపోయాడు. ఇది గమనించిన తల్లి పరుగున వెళ్లి చేయి అందుకోబోయినా చిన్నారి జారిపోయాడు. ఆమె రోదిస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. పోలీసులు, 108, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ, వైద్యశాఖ సిబ్బంది గ్రామానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మొదట 108 సిబ్బంది బోరు రంధ్రంలోకి ప్రాణవాయువు వదిలారు. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు (ఎన్డీఆర్‌ఎఫ్‌) కూడా రంగంలోకి దిగాయి. బోరులో ఉన్న బాలుడిపై మట్టిపడకుండా వారు జాగ్రత్తలు తీసుకున్నారు. స్థానిక యంత్రాంగం బోరుకు సమాంతరంగా 22 అడుగుల లోతు గుంత తవ్వారు. 15 అడుగుల వద్దే బాలుడు ఇరుక్కుపోయాడని గుర్తించారు.


అక్కడ బాలుడి అరుపులు వారికి వినిపించాయి.రోబోటిక్‌ చేయిని వాడేందుకు సిద్ధమయ్యారు. జిల్లా కలెక్టర్‌ శశిధర్‌, గ్రామీణ ఎస్పీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గ్రామానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. బాలుడు బోరు బావిలో పడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు పూర్తి చేసి బాలుడిని రక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com