ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రాజధానిలో రాచబాటలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 14, 2017, 01:37 AM

 (అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి) : రాజధాని నలుమూలలనూ పరస్పరం అనుసంధానించి, అమరావతి అభివద్ధికి చోదకశక్తులుగా విరాజిల్లబోతున్న ఫేజ్‌-1 రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇందులోని సీడ్‌ యాక్సెస్‌, 7 ప్రాధాన్య రోడ్ల ఏర్పాటు పనులు ప్రస్తుతం సాగుతున్న తీరునుబట్టి చూస్తే కొద్ది నెలల్లోనే ఈ 8 రహదారులూ పూర్తయి, తమ సేవలను అందించేందుకు సిద్ధమవుతాయని భావిస్తున్నారు. అమరావతి అభివ ద్ధి సంస్థ (ఏడీసీ) ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయించేందుకు దాని అధికారులు, కాంట్రాక్ట్‌ కంపెనీల సిబ్బంది కృషి చేస్తున్నారు.


సాధ్యమైనంత వరకూ నేరుగా


మొత్తం పొడవు 84.49 కి.మీ., నిర్మాణ వ్యయం రూ.1306.50 కోట్లుగా ఉన్న ఈ ఫేజ్‌-1 రోడ్లను ప్రధానంగా 2 విభాగాలుగా విభజించవచ్చు. ఇవి- సీడ్గ యాక్సెస్‌ రోడ్డు, 7 సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్లు. వీటిల్లో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును 8 వరుసలతో నిర్మించనుండగా, సబ్‌ ఆర్టీరియల్‌ రోడ్లలోని ఈ-8, ఎన్‌-9లను 6 లేన్లు (వీటిల్లో 2 బీఆర్టీఎస్‌ కోసం), మిగిలిన ఎన్‌-4, ఎన్‌- 14, ఎన్‌-16, ఈ - 10, ఈ-14లను 4 వరుసలతో ఏర్పాటు చేస్తున్నారు. తదనుగుణంగా వీటి వెడల్పు 60 మీటర్ల నుంచి 40 మీటర్ల మధ్య ఉంటుంది. ఇవన్నీ కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సాధ్యమైనంత వరకూ మలుపులు లేకుండా రూపుదిద్దుకుని, ఎక్స్‌ప్రెస్‌ వేలను తలపించనున్నాయి. మధ్యలోనూ, ఇరుపక్కలా అలరించే పచ్చదనం, సైక్లింగ్‌ ట్రాక్‌లతోపాటు కొన్నింటికి బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం (బీఆర్టీఎస్‌) కోసం ప్రత్యేక లేన్లు ఉంటాయి.


రాజధానికి వెన్నుముక సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు


 ఈ ఫేజ్‌- 1 రోడ్లన్నింట్లో అత్యంత ప్రధానమైనదిగానూ, రాజధానికి జీవనాడిగానూ అభివర్ణించబడుతున్న సీడ్గ యాక్సెస్‌ రోడ్డును వాస్తవానికి కనకదుర్గమ్మ వారధి నుంచి దొండపాడు వరకూ నిర్మించాల్సి ఉండగా, భూసేకరణ ఇత్యాది సమస్యల కారణంగా ప్రస్తుతం వెంకటపాలెం- దొండపాడుల మధ్య 18.27 కిలోమీటర్ల మేర మాత్రమే నిర్మిస్తున్నారు. వారధి- వెంకటపాలెం మధ్య భాగాన్ని (3.03 కి.మీ.) భూసేకరణ పూర్తయిన అనంతరం చేపట్టనున్నారు. ప్రఖ్యాత ఇంజినీరింగ్‌ సంస్థ ఎన్‌.సి.సి. ఈ 18.27 కిలోమీటర్ల పొడవున రోడ్డును నిర్మిస్తోంది. దీని అంచనా వ్యయం రూ.215.15 కోట్లు. కొన్ని నెలల క్రితం ప్రారంభమైన దీని నిర్మాణం వివిధ కారణాల ద ష్ట్యా మొదట్లో కొంత ఆలస్యమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి హెచ్చరికలు, ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారధి నిరంతర పర్యవేక్షణతో ఈ మధ్యకాలంలో ఊపందుకుంది. ఒక్క లేయర్‌ మినహా దీని నిర్మాణం పూర్తయిందని రాష్ర్ట పురపాలక శాఖ మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ తెలిపారు. అయితే కొద్ది చోట్ల భూసమీకరణ జరగనందున పనులు ఆగాయని, 45 రోజుల్లో ఆ సమస్యలను పరిష్కరించి, కొద్ది నెలల్లోనే వెంకటపాలెం- దొండపాడుల మధ్య సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును పూర్తి చేయనున్నామని చెప్పారు. వారధి నుంచి వెంకటపాలెం మధ్య నిర్మించాల్సిన ఈ రహదారి 2వ భాగపు పనులను కూడా సాధ్యమైనంత త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.


పాపిట రేఖలా ప్రాధాన్య రహదారులు..


ఈ 7 ప్రయారిటీ రోడ్లు (సబ్‌ ఆర్టీరియల్‌) సైతం చురుగ్గా నిర్మితమవుతున్నాయి. రాజధానిలోని వివిధ ప్రదేశాలను ఒకదానికొకటిని కలుపుతూ, అదుేత అంతర్గత రవాణా వ్యవస్థ ఏర్పాటవడంలో వీటిదే ప్రధాన ప్త్రా. వీటిల్లో 3 తూర్పు- పడమరల మధ్య, మిగిలిన 4 ఉత్తరం- దక్షిణ దిశల మధ్య సాగనున్నాయి. వీటన్నింటి మొత్తం పొడవు 66.22 కిలోమీటర్లు, నిర్మాణ వ్యయం రూ. 1091.35 కోట్లు. వీటిని 4 ప్యాకేజీలుగా విడగొట్టి, టెండర్లు పిలవగా వేర్వేరు సంస్థలు దక్కించుకున్నాయి.  ప్యాకేజీ-1లో ఉన్న ఈ- 8 వెంకటపాలెం నుంచి నెక్కల్లు వరకు వెళ్తుంది. దీని పొడవు 13.65 కి.మీ. ఖర్చు రూ.272.19 కోట్లు. ప్యాకేజీ- 2లోని ఎన్‌-9 (ఉద్ధండరాయునిపాలెం- నిడమర్రు) పొడవు 13.16 కి.మీ., నిర్మాణ వ్యయం రూ.214.94 కోట్లు. ప్యాకేజీ-3 లోని ఎన్‌-4 (వెంకటపాలెం- నవులూరు, 7.23 కి.మీ.), ఎన్‌-14 (అబ్బరాజుపాలెం- శాఖమూరు, 8.27 కి.మీ.)ల మొత్తం వ్యయం రూ.266.25 కోట్లు. ప్యాకేజీ-4లోని ఈ-10 (పెనుమాక- నీరుకొండ, 7.81 కి.మీ.), ఈ-14 (నీరుకొండ- మంగళగిరి, 7.33 కి.మీ.), ఎన్‌-16 (దొండపాడు- నెక్కల్లు, 8.77 కి.మీ.)ల మొత్తం నిర్మాణ వ్యయం రూ.337.97 కోట్లు.


ఫేజ్‌-2 రోడ్ల పనులపైనా దృష్టి...


మొత్తం 11 రోడ్లున్న అమరావతి ఫేజ్‌-2 రోడ్ల నిర్మాణాన్ని కూడా సత్వరమే చేపట్టేందుకు ఏడీసీ సమాయత్తమవుతోంది. ఈ-2, ఈ-4, ఈ-6, ఈ-12, ఈ-15 అనే తూర్పు- పడమర ప్రదేశాలను కలిపే వాటితోపాటు ఎన్‌-1, ఎన్‌-2, ఎన్‌-5, ఎన్‌-7, ఎన్‌-11, ఎన్‌-18 పేర్లతో రాజధానిలోని ఉత్తర- దక్షిణ దిశలను అనుసంధానించే రహదారుల ఏర్పాటుకు వడివడిగా చర్యలు తీసుకుంటోంది. వీటిల్లో ఈ-6, ఈ-12, ఎన్‌-11 అనే 3 రహదారులకు రూ.510 కోట్ల అంచనా వ్యయంతో త్వరలో టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ బ్యాంక్‌ నిధులు సమకూర్చనున్న ఈ రోడ్లకు టెండర్ల ప్రక్రియ ముగుస్తూండగానే మిగిలిన 8 రోడ్లకు కూడా టెండర్లు పిలవాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com