ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలిరోజు ఈడెన్‌ గార్డెన్స్‌లో గంట కొట్టేదెవెరో తెలుసా?

national |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2019, 01:41 PM

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా నవంబర్ 22న భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే చారిత్రక డే/నైట్‌ టెస్టుకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, పశ్చిమ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. ఈ పింక్ బాల్ టెస్టును బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా తొలిరోజు టెస్టు ప్రారంభానికి ముందు వీరిద్దరూ ఈడెన్ గార్డెన్స్ బెల్‌ను మోగించనున్నారు. ఈ విషయాన్ని బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ అభిషేక్‌ దాల్మియా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తొలిరోజు కార్యక్రమాల్లో భాగంగా వివిధ రంగాలకు చెందిన భారత క్రీడా దిగ్గజాలను క్రికెట్ ఆసోసియేషన్ ఆప్ బెంగాల్(క్యాబ్) సన్మానించనుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు చెస్ లెజెండ్ విశ్వనాథన ఆనంద్, ఒలింపిక్‌ ఛాంపియన్‌ అభినవ్‌ బింద్రా, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, వరల్డ్ ఛాంపియన్‌ పీవీ సింధులను క్యాబ్ సన్మానించనుంది. వీరితోపాటు ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన మేరీకోమ్‌‌, టెన్నిస్ గ్రేట్ లియాండర్ పేస్, బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్‌లు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వీరందరినీ ప్రత్యేకంగా రూపొందించిన మెమెంటోలతో సన్మానించనున్నట్లు అభిషేక్‌ ముఖర్జీ తెలిపారు. 2000లో భారత్‌-బంగ్లా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ఆటగాళ్లను సైతం క్యాబ్ సన్మానించనుంది. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ ఈ టెస్టు మ్యాచ్‌తోనే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా మారాడు. చారిత్రాత్మక డే/నైట్ టెస్టును వీక్షించాల్సిందింగా భారత ప్రధాని నరేంద్ర మోడీని సైతం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. భారత్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్, ఆప్ఘనిస్థాన్ తప్ప టెస్టు హోదా ఉన్న అన్ని దేశాలూ డే/నైట్‌ టెస్టులు ఆడాయి. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతులతో తొలి డే/నైట్‌ టెస్టు జరిగింది. ఆ తర్వాత భారత్‌‌లో గతేడాది ప్రయోగాత్మకంగా దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ను డే/నైట్‌లో నిర్వహించారు. పింక్ బాల్స్ అంత నాణ్యంగా లేవనే కారణంతో బీసీసీఐ డే/నైట్‌ టెస్టు ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తుంది. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా ఓ మ్యాచ్‌ను డే/నైట్‌లో ఆడాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా కోరినా బీసీసీఐ అందుకు అంగీకరించలేదు. అయితే గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక మళ్లీ డే/నైట్‌ టెస్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com