వైసీపీ ప్రభుత్వంలో విడుదల చేసిన జీవోలను ప్రజలందరికీ కనిపించేలా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలోని రహస్య జీవోలను జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సంబంధిత అధికారులకు చంద్రబాబు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2021 ఆగస్టు 15వ తేదీ నుంచి 2024 ఆగస్టు 28వ తేదీ వరకూ గోప్యంగా ఉంచిన జీవోలన్నిటినీ జీవోఐఆర్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సాధారణ పరిపాల శాఖ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జీవోఐఆర్ వెబ్‌సైట్‌ను అధికారులు పునరుద్ధరించటంతోపాటు పాత జీవోలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.2008 నుంచి ఇప్పటివరకూ అన్నీ ప్రభుత్వ ఉత్తర్వులూ జీవోఐఆర్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి.
అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 మధ్య విడుదల చేసిన ఉత్తర్వులు మాత్రం సైట్‌లో అప్‌లోడ్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే అప్పటి జగన్ సర్కార్ ఈ పని చేసిందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అక్రమాలు చేసేందుకు, తప్పులు కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలను అణచివేసేందుకే రహస్య జీవోలు విడుదల చేస్తున్నారని పెద్దఎత్తున నిరసనలు సైతం చేశారు. ఈ మేరకు తాజాగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం వాటన్నిటినీ అప్‌లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ హయాంలోని మూడేళ్ల కాలానికి సంబంధించిన ప్రభుత్వ జీవోలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో సమాచార లోపం ఏర్పడిందని సురేశ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం అధికారిక నిర్ణయాలు జీవోల రూపంలో ప్రజలకు స్పష్టతనిస్తాయని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి అభిప్రాయపడ్డారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ సమాచారం ప్రజలకు ఇవ్వాల్సి ఉన్నందున జీవోలు వెబ్‌సైట్‌లో ఉంచితే దానికి సంబంధించిన దరఖాస్తులూ తగ్గుతాయని ఆయన చెప్పారు. గడచిన మూడేళ్ల కాలంలో ప్రజలకు అందుబాటులో లేని ప్రతి జీవోను జీవోఐఆర్ సైట్‌లో ఉంచాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలల్లో ఆ మూడేళ్ల కాలానికి సంబంధించిన జీవోలన్నీ అప్‌లోడ్ చేయాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.