నిత్యం వేలాది మంది వచ్చే తిరుపతిని లక్ష్యంగా చేసుకుని బాంబుల బూచోళ్లు చెలరేగుతున్నారు. తిరుపతి విమానాశ్రయంతో పాటు ప్రధాన హోటళ్లకు వారం రోజుల నుంచి తరచూ బాంబు బెదిరింపులు అందుతున్నాయి. తాజాగా ఆదివారం గోవిందరాజస్వామి ఆలయం సహా ఇస్కాన్ టెంపుల్‌కు కూడా బాంబులు పెట్టినట్టు సమాచారం రావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. మరోవైపు ఈ బెదిరింపుల వెనుక ఉన్న బాధ్యులు ఎవరు? వారి ఉద్దేశమేమిటి? అన్న అంశాలపై కూడా దృష్టి సారించారు. తిరుపతి విమానాశ్రయానికి ఈ నెలలోనే మూడుసార్లు బెదిరింపులు వచ్చాయి.
తొలుత ఈ నెల 4న స్టార్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని పేల్చేస్తామంటూ మెయిల్ అందింది. 22న అదేసంస్థకు మరోసారి బెదిరింపు సందేశం వచ్చింది. 24న స్టార్ ఎయిర్‌లైన్స్, ఇండిగో విమానాలను పేల్చేస్తామంటూ ఎక్స్‌లో బెదిరించారు. దీనిపై ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు మెయిల్స్ కోల్‌కతాకు చెందిన మిత్ర అనే వ్యక్తి నుంచి వచ్చాయని ప్రాథమికంగా గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకుని బెంగళూరు తరలించినట్టు సమాచారం. తిరుపతి విమానాశ్రయానికి కూడా అదే వ్యక్తి నుంచి బెదిరింపులు అందినట్టు విచారణలో తేలితే ఏర్పేడు పోలీసులకు మిత్రను అప్పగించే అవకాశముందని తెలిసింది. ఈ నెల24న తిరుపతిలోని రాజ్ పార్క్, రీనెస్ట్, పాయ్ వైస్రాయ్, రిగాలియా తదితర ప్రముఖ హోటళ్ల మేనేజర్లకు బాంబు బెదిరింపుతో కూడిన మెయిల్స్ అందాయి. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. శనివారం రీనెస్ట్, రాజ్‌పార్కు, పాయ్‌వైస్రాయ్, రిగాలియా, గోవింద హైట్స్ హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చాయి. ఆయా హోటళ్లలోని విదేశీయులు గదులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆదివారం రాజ్ పార్కు, రీనెస్ట్, ఫార్చ్యూన్ కెన్సెస్ హోటళ్లతో పాటు వరాహస్వామి ఆలయం, తీర్థకట్ట వీధిలకు బెదిరింపులు అందాయి. సాయంత్రం ఇస్కాన్ టెంపుల్‌కూ బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపుల వెనుక బాధ్యులెవరు? ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? అనే అంశాలపై తిరుపతి పోలీసులు దృష్టి సారించారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ బెదిరింపులన్నీ ప్రాక్సీ యాప్స్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లలో ఉండే పబ్లిక్ వైఫైల నుంచి పంపించి ఉంటారని భావిస్తున్నారు. ఈ ప్రాక్సీ యాప్‌లను వాడడం వల్ల స్థానికంగానే మెసేజ్‌లు, మెయిళ్లు పంపించినా ఎక్కడో సుదూర దేశాల నుంచి పంపినట్టు చిత్రీకరించే అవకాశముందని పోలీసువర్గాలు చెబుతున్నాయి.