చంద్రబాబుతో తనకు వ్యక్తిగత సంబంధాలూ లేవని షర్మిల స్పష్టం చేశారు. రాజశేఖర్‌రెడ్డి తన బిడ్డ (షర్మిల) పెళ్లికి ఆయన్ను పిలిచారని, అదే విధంగా తానూ తన కుమారుడి వివాహానికి పిలిచానని తెలిపారు. ‘ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్లకు సభ్యత, సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి చదివింది జగన్ స్ర్కిప్టు కాదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ‘ఆస్తుల్లో నలుగురు చిన్న బిడ్డలకు(మనుమడు, మనుమరాళ్లకు) సమాన వాటా ఉంటుందన్న రాజశేఖర్‌రెడ్డి ఆదేశం అబద్ధమని మీ బిడ్డలపై ప్రమాణం చేస్తారా? మీరు కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వాళ్లే! రాజకీయంగా, ఆర్థికంగా ఆయన వల్ల బలపడినవాళ్లే. ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే’ అని ఆక్షేపించారు.