వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి పంచాయతీ కొనసాగుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ , ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆస్తుల పంపకాలకు సంబంధించి ఒకరిపై ఒకరు లేఖస్త్రాలు సంధిస్తూ విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్తుల పంచాయతీపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ‘‘నా కొడుకు సాక్షిగా చెప్తున్నా నేను వైసీపీలో ఒక్క రూపాయి సంపాదించలేదు . దీనికి జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యం. నా ఆస్తులు, నా తండ్రి ఆస్తులు, నా కోడలు ఆస్తులు అమ్మి వైసీపీలో పెట్టాను. నా బిడ్డ సాక్షిగా చెబుతున్న.. నేను వైసీపీలో ఆస్తులు పోగొట్టుకున్న. ఈ విషయం జగన్‌కు తెలియదా. వైసీపీలో ఉన్నప్పుడు ఎంతో ఖర్చుపెట్టుకున్నా. ఆస్తులు అమ్మి అప్పులు కట్టాను. నేను ఆస్తులు పోగొట్టుకుంటే, మీరు ఆస్తుల కోసం కొట్లాడుతున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి 40 ఏళ్ళ రాజకీయాల్లో ఎంతో హుందాగా వ్యవహరించారని.. ఇప్పుడు షర్మిల, జగన్ వైఎస్ రాజశేఖరరెడ్డిని బజారుకీడుస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో జగన్, షర్మిల ఒకరికొకరు లేఖలు రాసుకుంటున్నారు. ‘‘నాకు ఎంతో బాధ కలుగుతోంది.. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. వైవీ సుబ్బారెడ్డి, నేను బాగుపడింది వైఎస్ విజయమ్మ వల్ల. షర్మిల తన పిల్లల మీద ఒట్టేస్తానని చెప్పింది. వైవీ సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడం లేదు. జగన్, షర్మిల ఆస్తుల విషయం విజయమ్మ చూసుకుంటుంది. మీ కుటుంబంలో మీరు రచ్చ చేసుకుంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు, జనసేనకు ఏమి సంబంధం. జగన్, షర్మిల గొడవను విజయమ్మ పరిష్కరిస్తుందని భావిస్తున్నా. తొందరగా సమస్య పరిష్కారం చూపాలని విజయమ్మను కోరుతున్నా. షర్మిల ఆడపడుచు.. ఆమె కన్నీళ్లు జగన్ కుటుంబానికి అరిష్టం. విజయమ్మ జగన్‌కు, షర్మిలకు న్యాయం చేయాలి’’ అని కోరారు.