ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి పథంలో పంచాయతీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2017, 01:56 AM

  పంచాయతీల్లో సంపద సృష్టి కేంద్రాలు  అభివృద్ధి ప్రణాళిక దేశానికే మోడల్‌ 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.1450 కోట్లు  ఏపీ దేశానికే ఆదర్శమని నీతి ఆయోగ్‌ ప్రశంసలు


అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : కేంద్ర, రాష్ట్ర పథకాల అనుసంధానంతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. అభివృద్ధిలో దేశంలో మన గ్రామ పంచాయతీలే ముందున్నాయి. కేంద్రం ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను ఇతోధికంగా వినియోగించుకోవడంతోపాటు స్థానికంగా పంచాయతీల ఆదాయాలను పెంచుకోవడమే ఇందుకు కారణం. దీనిపై మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సమావేశంలో నీతి ఆయోగ్‌ అధికారులే స్వయంగా మన అధికారులను ప్రశంసించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పంచాయతీ ల ప్రణాళికలతో అభివృద్ధి సాధ్యమైందని నీతి ఆయోగ్‌ అధికారులు ప్రశంసించారు. పంచాయతీరాజ్‌ శాఖ రూపొందించిన పటిష్టమైన పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక దేశానికే మోడల్‌గా నిలిచింది. ఇప్పటికే ఆ శాఖ కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులను కూడా పొందింది. మన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఈ ఏడాది 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.1450 కోట్లు వచ్చాయి. పంచాయతీల్లో పన్నులతోపాటు వివిధ రకాల సెస్సుల ద్వారా మరో రూ.1200 కోట్లు లభించాయి. వీటికి అనుసంధానంగా ఉపాధిహామీ పథకం ద్వారా సిమెంట్‌రోడ్లు, అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలు, చెక్‌డ్యాంలు, ఊటచెరువులు తదితర పనుల కల్పనద్వారా రూ.800 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ.150 కోట్లు గ్రామాలకు అందాయి. పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్‌శాఖ జీపీడీపీ ప్రణాళికలు రూపొందించింది. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, శ్మశానాల అభివృద్ధి, సిమెంట్‌ రోడ్లు, వీధిలైట్లతోపాటు నీటిసంరక్షణ పనులు చేపట్టారు. ఉపాధి నిధులతో మొక్కలు పెంపకాన్ని విస్తృతంగా చేపట్టారు. వివిధరకాల నిధుల అనుసంధానంతో 7వేల కిలోమీటర్ల మేర కు సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేశారు. గత మూడేళ్ల నుంచి గ్రామ పంచాయతీల్లో గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, తాగునీరు, వైద్య ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మహిళా శిశుసంక్షేమ శాఖల్లో గణనీయమైన ప్రగతి సాధించినట్లు పంచాయతీరాజ్‌ అడిషనల్‌ కమిషనర్‌ సుధాకర్‌రావు తెలిపారు.


స్వచ్ఛత దిశగా మరో ముందడుగు


రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత దిశగా మరో ముందడుగు వేసింది. ఇప్పటికే మండల కేంద్రాల్లో నిర్మిస్తున్న సంపద సృష్టించే కేంద్రాలను ఇకపై అన్ని పంచాయతీల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఈ ఏడాదిలో (2017) పూర్తి చేయాలని సంకల్పించింది. గతంలో మండల కేంద్రాల్లో డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తాజాగా అన్ని గ్రామాల్లో సుమారు అయిదు సెంట్లకు తగ్గకుండా స్థలాన్ని సేకరించాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలను జారీ చేసింది. వీటిని చెత్తవేసే కేంద్రాలుగా కాకుండా హరిత కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. జిల్లాలోని 39 మండలాలు, 925 పంచాయతీలు, 5,431 గ్రామాల వరకు ఉన్నాయి. గ్రామాల్లో వచ్చే చెత్తను దాన్ని పంచాయతీలకు ఒక ఆదాయ వనరులుగా చేయనున్నారు. 2015లో మండల కేంద్రాల్లో సంపద సృష్టి కేంద్రాలు (సాలిడ్‌ వెల్‌‌త ప్రాసెసింగ్‌ సెంటర్లు) ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం నిధులు రూ. 2.5 లక్షల నుంచి రూ. అయిదు లక్షల వరకు విడుదల చేశారు. గ్రామాల్లో ప్రజలు వేసిన చెత్తను ఈ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ తడి, పొడి చెత్త, ప్లాస్టిక్‌ గాజు వ్యర్థాలను వేరుచేస్తారు. ఇక్కడ నిర్మించిన అరల్లో వీటిని శుద్ధి చేయడం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరుతుంది. ప్రతి గ్రామ సచివాలయంలో అర కిలోమీటరులోపు వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు కనీసం ఐదు సెంట్లకు తక్కువ లేకుండా స్థలం కేటాయించాలని ఉన్నతాధికారులు సర్పంచులు, కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. మండల కేంద్రాల్లో విశాలమైన స్థలాలున్నచోట వాటిని ఏర్పాటుచేసి ఆదర్శ కేంద్రాలకు తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.


అంటురోగాలకు ఇక చెక్‌


ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సేకరించిన చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. గ్రామ పరిసరాలు, స్థానిక కుంటలు, ప్రధాన, అంతర్గత రహదారులు చెత్తకుప్పలతో దర్శనమిస్తున్నాయి. వీటి వల్ల కుక్కలు, పందులు, దోమలకు ఆవాస కేంద్రాలుగా తయారవుతున్నాయి. ఇలాంటి వాతావరణం కారణంగా ప్రజలు అంటురోగాలబారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను సంపద సృష్టి కేంద్రాలకు తరలించి రీసైక్లింగ్‌ చేసి సేంద్రియ ఎరువులు తయారుచేసుకోవాలని పంచాయతీలకు అధికారులు సూచించారు. చెత్తను వర్మీకంపోస్టులుగా తయారుచేసుకొని దాన్ని విక్రయించుకోవడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం వస్తుందనేది ప్రభుత్వ లక్ష్యం. పట్టణాల తరహాలో రహదారుల పక్కన చెత్తవేయడానికి తొట్టెలు ఏర్పాటుచేస్తారు. సంపద సృష్టి కేంద్రాలుగా కాకుండా వీటిని హరితవనాలుగా మార్చాలని యోచిస్తున్నారు. వీటిచుట్టూ మొక్కలు నాటి అభివృద్ధి చేస్తారు.


అన్ని పంచాయతీల్లో అమలు


జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో సంపద సృష్టి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని పంచాయతీల్లో షెడ్లు నిర్మాణం ఇంకా పునాదుల్లోనే ఉంది. చోడవరంలోని లక్ష్మిదేవిపేటలో సంపద సృష్టి కేంద్రం నిర్మాణ పనులు చివరిదిశకు చేరుకున్నాయి. బుచ్చెయ్యపేట మండలంలో ఇంకా నిర్మాణంలోనే ఉంది. రావికమతం, రోలుగుంటలో సంపద సృష్టి కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలోని స్థల సమస్యఉన్న పంచాయతీల్లో ఈ కేంద్రాల షెడ్లు ప్రారంభించలేదు. ఈ ఏడాది అన్నిపంచాయతీల్లో వీటి నిర్మాణాలను పూర్తిచేసి ప్రారంభించడానికి ఉన్నతాధికారులు చొరవతీసుకుంటున్నారు.


స్థల సేకరణ చేయాలని ఆదేశాలు


జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సంపద సృష్టి కేంద్రాలు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా పంచాయతీ అధికారిణి వి. కృష్ణకుమారి తెలిపారు. ఇప్పటికే సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు స్థల సేకరణ చేయాలని ఆదేశాలు ఇచ్చామని, ఈ నెల నుంచి జరిగే జన్మభూమిలో పాలకులు, అధికారులకు తెలియజేస్తామని శంకుస్థాపన పనులు చేయించి ఉపాధిహామీ నిధులతో వీటిని నిర్మిస్తామని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com