ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరస్ ను కనుగొనే బయోసెన్సర్ తయారీ

national |  Suryaa Desk  | Published : Fri, Apr 24, 2020, 02:37 PM

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు కావొస్తున్నా ఇంకా ఇది మిస్టరీగానే ఉంది. అనేక విషయాలపై స్పష్టత లేదు. కరోనా వైరస్ సోకినా చాలామందిలో లక్షణాలు కనిపించకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా సోకిందా లేదా అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. అలాగే ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతోంది. దీంతో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అలాగే గాలిలో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో వైరస్‌ ఉనికిని కనుగొనడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఓ గుడ్ న్యూస్ వినిపించారు శాస్త్రవేత్తలు. అతి తక్కువ సమయంలోనే కరోనా వైరస్ ను పసిగట్టే బయోసెన్సర్ తయారు చేశారు.తక్కువ సమయంలో కరోనాను కచ్చితత్వంతో కనుగొనే ఆప్టికల్‌ బయోసెన్సర్‌:అవును, కరోనా వైరస్ ను వెంటనే కచ్చితత్వంతో కనుగొనే ఆప్టికల్‌ బయోసెన్సర్‌ రూపుదిద్దుకుంది. స్విట్జర్లాండ్‌ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న ల్యాబొరేటరీ టెస్టుల స్థానాన్ని ఇది భర్తీ చేయదని, అయితే క్లినికల్‌ పరీక్షలకు ప్రత్యామ్నాయంగా బయోసెన్సర్‌ ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. జ్యూరిచ్‌లోని ఈటీహెచ్‌ వర్సిటీ పరిశోధకులు ఈ సెన్సర్‌ను అభివృద్ధి చేశారు. గాలిలో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో వైరస్‌ ఉనికిని కనుగొనేందుకు ఇది ప్రముఖంగా సహాయపడుతుందని వారు తెలిపారు. కరోనా మహమ్మారిని సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తీసుకురావడానికి ప్రస్తుతం వేగవంతమైన, కచ్చితమైన పరీక్షలు అవసరమని, ఈ నేపథ్యంలో తాము అభివృద్ధి చేసిన బయోసెన్సర్‌ ఆ దిశగా ఉపయోగపడవచ్చని చెప్పారు.ఆర్ టీ-పీసీఆర్ కు ప్రత్యామ్నాయంగా బయోసెన్సర్:ప్రొఫెసర్ జింగ్ వాంగ్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ బయోసెన్సర్ కనుగొన్నది. వాంగ్ స్విట్జర్లాండ్ లోని ఎంపా(జ్యూరిచ్) పరిశోధనశాలలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనశాలల్లో రివర్స్ ట్రాన్స్ స్క్రిప్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్(ఆర్ టీ-పీసీఆర్) పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అనుమానిత వ్యక్తుల్లో చాలా తక్కువస్థాయిలో వైరస్ ఉన్నప్పటికీ ఈ పరీక్ష ద్వారా తెలిసిపోతుంది. అందుకే దీనికి అంత ప్రాధాన్యం. అయితే ఫలితాలు వెల్లడయ్యేందుకు ఆలస్యమవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా జింగ్ వాంగ్ బృందం బయోసెన్సర్ ను సృష్టించింది.ఈ సెన్సర్ తో ఎంతో సురక్షితంగా, కచ్చితత్వంతో వైరస్ ను కనిపెట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. లోకలైజ్డ్ సర్ఫేస్ ప్లాస్మన్ రిసోనెన్స్ టెక్నాలజీ ఇందుకోసం వినియోగించారు. బయోసెన్సర్ ద్వారా కృత్రిమ డీఎన్ఏ గ్రాహకాలను ఏర్పరుస్తూ అనుమానితుల నమూనాల్లో సార్స్ కొవ్-2 వైరస్ ఆర్ఎన్ఏ క్రమాలను గుర్తించడం ద్వారా కరోనా సోకిందా లేదా అని తక్కువ సమయంలో పసిగట్టవచ్చని పరిశోధకులు వివరించారు.ప్రపంచవ్యాప్తంగా 27.15లక్షల కరోనా కేసులు, 7.45లక్షల మరణాలు:


ప్రపంచవ్యాప్తంగా 27లక్షల 15వేల మంది కరోనా బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 83వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నిన్న(ఏప్రిల్ 23,2020) ఒక్కరోజే కరోనాతో 6వేల 300మందికిపైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 90వేల మందికిపైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 7లక్షల 45వేల మంది కోలుకున్నారు.అమెరికాలో 8.79లక్షల కరోనా కేసులు, 49వేల మరణాలు:అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. అమెరికాలో 8లక్షల 79వేల మంది కరోనా బారినపడ్డారు. అక్కడ కొత్తగా 30వేల 713 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 49వేల 769మంది కరోనాతో చనిపోయారు. అమెరికాలో ఇప్పటివరకు 85వేల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.భారత్ లో 23వేలు దాటిన కరోనా బాధితుల సంఖ్య:మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 23వేలు దాటింది. 23వేల 106మంది కరోనా బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 724మంది మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4వేల 980మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. 6వేల 427 కేసులు నమోదయ్యాయి. నిన్న(ఏప్రిల్ 23,2020) ఒక్కరోజే కొత్తగా 778 కేసులు నమోదయ్యాయి. ఒక ముంబైలోనే కరోనా పాజిటివ్ కేసులు 4వేలు దాటాయి. మహారాష్ట్రంలో ఇప్పటివరకు 283మంది కరోనాతో చనిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com