మీ దగ్గర ఉన్న డబ్బును బ్యాంకు ఖాతాలో అలాగే ఉంచితే పెద్దగా వచ్చే లాభమేమీ ఉండదు. ఆ డబ్బును మరిన్ని మార్గాల్లో పెట్టుబడి పెడితే ఎంతో కొంత ఆదాయం వస్తుంది. అయితే ఎందులో పెట్టుబడి పెడితే ఎంత లాభం అనేది తెలుసుకుంటేనే మీ డబ్బును సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు.
లిక్విడ్ ఫండ్స్: 6-8% రిటర్న్స్ వస్తాయి. దీంట్లో ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్ ఉండదు. లో-రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కూడా. దీనిపై వచ్చే లాభాలకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆన్లైన్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు నచ్చినట్టుగా డబ్బులు వేయొచ్చు. అవసరం ఉన్నప్పుడు వెనక్కి తీసుకోవచ్చు.
ఫిక్స్డ్ డిపాజిట్: 3-7% రిటర్న్స్ వస్తాయి. ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు. కానీ పెనాల్టీల గురించి తెలుసుకోవాలి. ఎక్కువ కాలం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ ఎక్కువగా ఇస్తుంది బ్యాంకు. ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు అనుకునేవారికి ఇది సరైన పెట్టుబడి సాధనం. కాకపోతే మీకు డబ్బులు ఎప్పుడు అవసరం అవుతాయి? ఎప్పుడు వెనక్కి తీసుకోవాలి? అన్న ప్లానింగ్ మీకు ఉండాలి.
ఈక్విటీ: రిటర్న్స్ ఎంత వస్తాయన్నది చెప్పలేం. ఎంతైనా రావొచ్చు. మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే ఒకట్రెండు రోజులు ఆగాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడులతో ఎంతైనా సంపాదించొచ్చు. రిస్క్ వద్దు అనుకుంటే సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్-సిప్ ద్వారా నెలనెలా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఈక్విటీలో రిస్క్ ఎక్కువ, లాభనష్టాలూ ఎక్కువే. దీనిపై వచ్చే లాభాలపై పన్నులు మాత్రం తక్కువగానే ఉంటాయి.
పీపీఎఫ్: 7% రిటర్న్స్ పొందొచ్చు. ఎక్కువకాలం పెట్టుబడి పెట్టాలి. కాకపోతే వడ్డీ తక్కువ. పన్ను మినహాయింపులు ఉంటాయి. ఎంత ఎక్కువకాలం పెట్టుబడి పెడితే అంత లాభం వస్తుంది. మధ్యలోనే డబ్బులు వెనక్కి తీసుకోవాలనుకునేవారు ఇందులో పెట్టుబడి పెట్టడం సరికాదు.
పీ2పీ లెండింగ్: 18-26% రిటర్న్స్. మీరు ఎంతకాలానికి అప్పు ఇస్తారో డబ్బులు వెనక్కి రావడానికి అంతకాలం ఎదురుచూడాల్సిందే. రిటర్న్స్ ఎక్కువ రిస్కు కూడా ఎక్కువే. అందుకే ఒకే లోన్ ఇవ్వకుండా వేర్వేరు మార్గాల్లో లోన్స్ ఇవ్వడం మంచిది. అయితే ఎవరికి లోన్ ఇస్తున్నారన్నది ముఖ్యం. దీనికి ఎలాంటి బీమా ఉండదు.