కరోనా.. పాక్‌ క్రికెట్‌ టీమ్‌ విరాళం

  Written by : Suryaa Desk Updated: Thu, Mar 26, 2020, 03:27 PM
 

 కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం అందించడానికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ ఆ దేశ ప్రభుత్వానికి రూ. 5 మిలియన్‌లు విరాళంగా ఇచ్చింది. జాతీయ అత్యవసర నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి ప్రకటించారు. కరోనాపై పోరాటానికి సెంట్రల్‌ కాంట్రాక్టు ఆటగాళ్లు రూ. 5 మిలియన్‌లు విరాళం ఇచ్చారని ఆయన తెలిపారు.అలాగే బోర్డులోని కిందిస్థాయి నుంచి సీనియర్‌ మేనేజర్‌ వరకు ఉన్న ఉద్యోగులు అంతా తమ ఒక్క రోజు జీతాన్ని జాతీయ అత్యవసర నిధికి అందజేయనున్నట్టు మణి వెల్లడించారు. జనరల్‌ మేనేజర్‌ ఆపై స్థాయి అధికారులు రెండు రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు చెప్పారు. పీసీబీ ఎప్పుడూ కష్ట సమయాల్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కరోనా వైరస్‌ క్రికెట్‌కు అంతరాయం కలిగించవచ్చు కానీ, దేశం మొత్తం ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం అవసరమైన అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. మరోవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పాకిస్తాన్‌లో కూడా విజృంభిస్తోంది. పాక్‌లో ఇప్పటివరకు 1,000కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.