మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయని ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నది. రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందని ఆయన చెప్పారు. మూడు పార్టీల కలయికతో ఏర్పడే ప్రభుత్వం ఆరు నెలలకంటే ఎక్కువ కాలం మనలేదని మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందించారు. దేవేంద్ర ఫడ్నవీస్ తనకు చాలా ఏళ్లుగా తెలుసునని, కానీ ఆయన జ్యోతిశ్శాస్త్రవేత్త అని తనకు తెలియదని పవార్ వ్యాఖ్యానించారు.