అమిత్ షా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 22, 2019, 11:43 AM
 

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు ట్విటర్లో పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో అమిత్ షా సేవలను ప్రధాని కొనియాడారు. దేశాన్ని ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ట్విటర్లో ప్రధాని స్పందిస్తూ.. ‘‘అంకితభావం, అనుభవం, నైపుణ్యంతో కూడిన పార్టీ సభ్యుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 


కేంద్ర ప్రభుత్వంలో మాత్రమే కాదు... దేశాన్ని ఏకం చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను..’’ అని పేర్కొన్నారు.మంగళవారం 55 ఏట అడుగుపెడుతున్న అమిత్ షా... ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గాంధీ‌నగర్ నుంచి విజయం సాధించారు. గుజరాత్‌లో ఆయన తొలిసారి 1997లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని 80 స్థానాలకు గానూ బీజేపీ 73 చోట్ల విజయం సాధించడంతో అమిత్ షాకి పార్టీలో మంచి పేరు వచ్చింది. 2014 జూలైలో బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఆరెస్సెస్ విద్యార్ధి విభాగం ఏబీవీపీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అమిత్ షా..  మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రిగా సేవలందించారు.