ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడుకొండలవాడి యాత్ర ఎన్నెన్నో జన్మల సర్వ పాపహరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 08:53 PM
చుట్టూ పచ్చని చెట్లు... చల్లని గాలి... దూరంగా కొండల వరస. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడుని చూడాలన్న ఆరాటం. మేఘాలను ముద్దాడుతూ ఆకాశ మార్గానికి దగ్గరగా చేసే కొండబాటలో నడవడం చెప్పలేని అనుభూతి. ఏడుకొండల వాడా... గోవిందా... గోవిందా... అనగానే లేని శక్తి వస్తుంది. భక్తిభావంతో ముక్తిమార్గం వైపు నడవాలనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఆనందం వైపు అడుగులు వేయాలని అనిపిస్తుంది. వక్షస్థలమున శ్రీ మహాలక్ష్మి నివసించడం వల్ల శ్రీనివాసుడయ్యాడు. తిరుమలకొండల్లో కొలువై ఉండటం వల్ల తరుమలేశుడయ్యాడు. శివరూపమని శైవులు భావించడం వల్ల వెంకటేశ్వరుడయ్యాడు. శాక్తేయులు బాలా త్రిపుర సుందరిగా భావించడం వల్ల బాలాజీగా మారాడు. ఆపదల నుంచి అవలీలగా బయట పడేస్తాడు కాబట్టి ఆపదమొక్కులవాడుగా అవతరించాడు. మొత్తంగా ఏడుకొండలవాడిగా ఎనలేని భక్తిభావాన్ని నింపాడు. ఆ భావనలో ఓలలాడిస్తున్నాడు.  అనంతమైన ప్రకృతి మాత అందాలను ఆస్వాదిస్తూ... దివ్య తీర్థ మహిమను దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ... తపోధనులకు నిలయమైన వైకుంఠధామ వైభవాన్ని నెమరేసుకుంటూ సాగే తిరుమల యాత్ర ముక్తిని ప్రసాదించే జ్ఞానక్షేత్రం, పుణ్య నిలయం. అందుకే తిరుమలను తీర్థాద్రి అని కూడా పిలుస్తారు. తిరుమల యాత్ర వల్ల ప్రకృతితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆయురారోగ్యాలు పెరుగుతాయి. జ్ఞానసిద్ధి కలుగుతుంది. ముక్తిభావం ముందుంటుంది. మానవ జీవిత పరమార్ధానికి దేవదేవుడు మనకిచ్చిన అందాల లోగిలి తిరుమల. . మానవజాతి పరమార్ధానికి అదొక ముక్తిమార్గం.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com