ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట బీజేపీ సీఎం అభ్యర్ధిగా రజనీ?

national |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2019, 07:18 PM

రాజకీయాల్లో అసాధ్యమనేది లేదు. ఏదైనా సాధ్యమే. ఇప్పుడు అదే జరగబోతోంది. తమిళనాడులోనూ బీజేపీ పాగా వేయబోతోంది. పాగా వేయడం కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ అధికారాన్ని కూడా చేజిక్కించుకోబోతోంది. ఇప్పటికే సీఎం అభ్యర్థిని కూడా సిద్ధం చేసినట్టే. ఇంతకీ, సీఎం అభ్యర్థి ఎవరనుకున్నారు...? ఇంకెవరు...! సూపర్ స్టార్ రజనీకాంత్... !!
తమిళ పవర్ స్టార్ రజనీకాంత్ టాక్ ఆఫ్ ది నేషన్ గా మారారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఆయన బీజేపీకి బహిరంగంగా మద్దతు తెలిపారు. మోడీ - షా ద్వయాన్ని కృష్ణార్జునులతో పోల్చారు. దీంతో, బీజేపీ-రజనీ మైత్రి మరోసారి బహిర్గతమైంది. గతంలో పలుసార్లు మోడీ, షా ద్వయం పలుమార్లు రజనీకాంత్ తో సమావేశమయ్యారు. బీజేపీలో రజనీ చేరిపోతున్నాడని వార్తలొచ్చాయి. తాను బీజేపీకే ఓటు వేస్తానని 2004 ఎన్నికలకు ముందు రజనీ ప్రకటించడం, తన రాజకీయాలు ఆధ్యాత్మికంగా ఉంటాయని అనడం, హిందూ మతం పట్ల పాజిటివ్ గా ఉండటం వంటి అంశాలు కూడా బీజేపీ-రజనీ మైత్రిని మరింత బలోపేతం చేసింది. 
ఉత్తరాదిలో ప్రాబల్యం సంపాదించుకున్న బీజేపీ దక్షిణాదిలో కూడా వ్యాపించాలని చూస్తోంది. కర్ణాటకలో ఎప్పటి నుంచో బలంగా ఉండి ఇప్పుడు తెలంగాణ - తమిళనాడు - ఆంధ్ర - కేరళ ప్రాంతాల్లో పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే, తమ భావాలకు దగ్గరగా ఉండి - తమను అభినందిస్తున్న రజనీని పార్టీలో కలుపుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. పైగా సినీ - క్రీడా ప్రముఖులను పార్టీలోకి చేర్చుకోవడం బీజేపీకి కొత్తేమీ కాదు. నిజానికి, బీజేపీకి రాజకీయాల్లో ఈ ఫార్ములా బలమైన అస్త్రంగా మారింది. బీజేపీ - రజనీకాంత్ అంశంపై చర్చ వచ్చిన నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక అభిప్రాయం చక్కర్లు కొడుతోంది. త్వరలో రజనీ బీజేపీలో చేరతారని - తమిళనాడు రాష్ట్రం నుంచి బీజేపీ సీఎం అభ్యర్ధిగా అవతరిస్తారని కొందరు కామెంట్ చేస్తున్నారు. రజనీ సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ, పార్టీని నడపడానికన్నా కూడా బలమైన పార్టీలో చేరడం, అధికారాన్ని దక్కించుకోవడమే మేలన్న అభిప్రాయానికి రజనీ వచ్చారని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. తాను రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు 2017 డిశంబర్ 31న రజనీ ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు - తమిళనాడులో ఉన్న మొత్తం 234 నియోజకవర్గాల్లో తన పార్టీ పోటీ చేస్తుందని రజనీ వెల్లడించారు. గెలిచిన మూడేళ్లలో హామీలను నెరవేర్చలేకపోతే తన పార్టీ తప్పుకుంటుందని కూడా రజనీ ప్రకటించారు. దీనికి త్వరలోనే ఓ చిన్న సవరణను రజనీ ప్రతిపాదించొచ్చేమో చూడాలి. అదేమిటంటే.... ‘తన’ పార్టీ అంటే... కొత్తగా పుట్టుకొచ్చేది కాదు. తాను కొత్తగా, తొలిసారిగా చేరబోతున్న ‘పార్టీ’ (బీజేపీ)గా అర్థం చేసుకోవాలని అంటారేమో చూడాలి...!!




 





 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com