ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాంటెక్స్ ఆధ్వర్యంలో డల్లాస్ లో ఘనంగా ముగిసిన మరో తెలుగు వెన్నెల

international |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 09:20 PM

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 139వసాహిత్య సదస్సు డాలస్ లో శ్రీ కృష్ణారెడ్డి కోడూరు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 139 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డల్లాస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వఛ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ముందుగా పుల్వామా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల ఆత్మశాంతికి రెండు నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. తరువాత డా. పుదూర్ జగదీశ్వరన్ గారు తన ‘ఆముక్త మాల్యద ‘ పరిచయపు ధారావాహికను , ఎన్ ఆర్ యు గారు తెలుగు సామెతలు, నుడికారాల పరిచయపు ప్రహేళికను కొనసాగించారు. డా. ఇస్మాయిల్ పెనుగొండ గారు ఇటీవలే స్వర్గస్తులైన డా.హేమలత పుట్ల గారి జీవనయానాన్ని, రచనలను మరొక్క సారి గుర్తు చేస్తూ నివాళులు అర్పించారు. గీతాంజలి పేరుతొ రాస్తున్న ప్రముఖ రచయిత్రి డా. భారతి గారు మరియు లలితానంద్ ప్రసాద్ గారు స్వీయ కవితా గానాన్ని చేసారు.
తదుపరి ముఖ్య అతిధి శ్రీ నారాయణ స్వామి వెంకట యోగి గారిని సభకు దయాకర్ మాడ గారు పరిచయం చేసారు. ముఫై ఏళ్ల సుదీర్ఘ సాహితీ ప్రస్థానం లో నిబద్దతతో వ్యవరిస్తూ పీడితుల పక్షాన, బాధితుల గొంతుగా మారి, తన అనుభవాల్ని, జ్ఞాపకాల్ని ‘సందూక’ లో పొందుపరిచి, తాను కన్న ‘కల్లోల కలల మేఘం ‘ ఉరుములు మెరుపులు కురిపిస్తూ ‘వానొస్తదా ?’ అని ప్రశ్నించే భావుకుడిగా అభివర్ణించారు. ఖండాలు దాటినా తన కవిసంగమపు కవిత్వ కరచాలనాన్ని మర్చిపోకుండా అక్షరీకరించి ‘నడిసొఛ్చిన తొవ్వ ‘ గా పదిలపరుచుకున్నాడు. రొట్ట మాకు రేవు వారి అవార్డు పొందిన ‘వానొస్తదా ?’ లోని కొన్ని కవితలను నసీం గారు సభకు చదివి వినిపించారు.
తరువాత ప్రధాన వక్త శ్రీ నారాయణ స్వామి వెంకట యోగి గారు ‘తెలుగులో వర్తమాన కవిత్వం – కవిత్వ విమర్శ ‘ అంశం పై ప్రసంగిస్తూ ప్రబంధాల నుండి నేటి దాకా సాహిత్యం లో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరిస్తూ కర్రీ పాయింట్ లో పనిచేస్తూ ఒక కవి రాసిన కవితను చదివి విన్పించి వివరించారు. స్థానికతకు నేటి కవితలలో ప్రాధాన్యతను, సామాజిక మాధ్యమాలలో విరివిగా వెళ్లి విరుస్తున్న నూతన గొంతుకలను, వారి వినూత్న కవితా వస్తువులను సభకు పరిచయం చేసారు. అలాగే సద్విమర్శను తట్టుకోగలిగే స్తైర్యాన్ని కవులు కలిగి ఉండాలని, విమర్శకులు కూడా ముఖస్తుతి కి కాక వస్తు విమర్శ నిర్మొహమాటంగా చేయడం వలన ఇటు రచయితకి అటు సాహిత్యానికి మేలు జరుగుతుందని వక్కాణించారు. అయితే ఇది చెప్పినంత సులభం కాదని కొన్ని సందర్భాలలో ఇది వ్యక్తిగతం అయి సంబంధాలు క్షీణించే ప్రమాదమూ ఉందని చెప్పి నవ్వులు పూయించారు. 90 నిమిషాలు గడిచిన తర్వాత కూడా అప్పుడే కార్యక్రమం ముగిసిందా అనిపిస్తూ, ఆహుతుల కరతాళ ధ్వనులతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.|
సభికుల హర్షద్వానాల మధ్య ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షుడు శ్రీ చినసత్యం వీర్నపు , ఉత్తరాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, కార్యదర్శి ఉమామహేష్ పార్నపల్లి, కోశాధికారి శరత్ యర్రం, సతీష్ బండారు, ఇతర కార్యవర్గ సభ్యులు మరియు పాలక మండలి సభ్యులు చంద్ర కన్నెగంటి ,సాహిత్య వేదిక కమిటి సభ్యులు శ్రీ నారాయణ స్వామి ని జ్ఞాపిక, దుశ్శాలువాతో సన్మానించి ఘనంగా సత్కరించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు గారు సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.
సాహిత్య వేదిక సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, మన టి.వి, టీవీ 9,టి.ఎన్.ఐ, ఏక్ నజర్,దేసిప్లాజా లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com