అమెరికా పర్యటనలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపీకి పెట్టుబడలే లక్ష్యంగా పలువురు ప్రముఖులతో లోకేష్ భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ఏపీ మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో భేటీ అయిన మంత్రి.. ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాఫ్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని... సులభతరమైన పౌరసేవలకు సహకారం అందించాలని కోరారు. లాస్ వెగాస్‌లో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి ప్రాంగణంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ను కలిసి ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్‌పై అమెజాన్ దృష్టి సారిస్తుందని రేచల్ స్కాఫ్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లో క్లౌడ్ సేవలు, పరిష్కారాలను విస్తరించడంలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఏఐ అండ్ ఎంఎల్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నామని.. ప్రభుత్వాలు, భారీ పారిశ్రామిక సంస్థలకు డిజిటల్ సొల్యూషన్స్ సేవలు అందజేయడం లక్ష్యమని స్పష్టం చేశారు. క్లౌడ్ కంప్యూటింగ్, స్టోరేజి, డేటా నిర్వహణ సేవల్లో అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు. నెట్‌ఫ్లిక్స్, ఎయిర్బిఎన్బి, 3 ఎమ్ వంటి అనేక రకాల పరిశ్రమలను తమ సంస్థ కలిగి ఉందన్నారు. ఏడబ్ల్యూఎస్ ప్రపంచవ్యాప్తంగా 32% మార్కెట్ వాటాతో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్లో అతిపెద్ద ప్లేయర్ అని చెప్పుకొచ్చారు. 2023 నాటికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) వార్షిక ఆదాయం సుమారు $90.8 బిలియన్లుగా ఉండగా, 2024కి $100 బిలియన్లకు చేరుకుందన్నారు. స్మార్ట్ గవర్నెన్స్‌కు క్లౌడ్ సేవలు అందించండి అని రేచల్ స్కాఫ్ తెలిపారు.