కడప జిల్లా, జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరులో రాజకీయ చిచ్చు రగులుకుంది. వైసీపీ, బీజేపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఓ భూ వివాదంలో చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రాణాలు పోయేలా దాడులు చేసుకునేలా చేసింది. ఈ ఘటనతో జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఓ భూవివాదంలో తలెత్తిన వివాదంతో గొడ్డళ్లు, వేట కొడవళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు.
దీంతో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పెద్ద దండ్లూరులో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి అనుచరులైన ఇద్దరికి ఓ ల్యాండ్ విషయంలో గతంలో వివాదం చెలరేగింది. అప్పట్లో దీన్ని స్థానిక పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా వివాదం పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు వారి మధ్య వివాదం చెలరేగింది. అయితే ఈసారి వైసీపీ, బీజేపీ శ్రేణులు మాటలతో సరిపెట్టుకోలేదు. ఏకంగా మారణాయుధాలతో ఇరువర్గాలూ దాడులు చేసుకున్నాయి. ప్రాణాలు పోయేలా పొడుచుకున్నారు. తమ ప్రత్యర్థుల రక్తం కళ్ల చూడాలని నరుక్కున్నారు. ఈ ఘర్షణతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రామస్థులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బాధితులను వారి కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. తన వర్గీయులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పరామర్శించారు. గతంలో జరిగిన గొడవలను పోలీసులు పూర్తిస్థాయిలో పరిష్కరించలేదని ఆయన మండిపడ్డారు. పోలీసుల వల్లే మరోసారి ఘర్షణలు జరిగాయని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు.