ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌లోనే దాయాదికి ఇచ్చిపడేసిన విదేశాంగ మంత్రి జైశంకర్

national |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2024, 09:12 PM

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరుగుతోన్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషణ్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశానికి భారత్ తరఫున కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. పాక్‌లో భారత విదేశాంగ మంత్రి తొమ్మిదేళ్ల తర్వాత పర్యటించడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2015లో సుష్మా స్వరాజ్ అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ.. పరస్పర గౌరవం ద్వారా ప్రాదేశిక సమగ్రత, సహకారం అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఈ మూడు ప్రపంచానికి పెను భూతాలని వ్యాఖ్యానించారు. దేశాల మధ్య సహకారం నిజమైన భాగస్వామ్యాలతో నిర్మాణం జరగాలని, ఏకపక్ష ఎజెండాలు కాదని పరోక్షంగా పాకిస్థాన్‌కు ఆయన హెచ్చరికలు చేశారు. కొన్ని దేశాలు ప్రాంతీయ ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నాయని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని జైశంకర్ సూచించారు. నమ్మకం, సహకారం, స్నేహం లోపిస్తే పొరుగువారు దూరమవుతారని స్పష్టం చేశారు.


ఇజ్రాయేల్-హమాస్-హెజ్బొల్లా యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణతో పాటు కోవిడ్-19 మహమ్మారితో ప్రపంచ సంబంధాలు క్లిష్టంగా మారిన సమయంలో ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోందని భారత విదేశాంగ మంత్రి అన్నారు. ‘తీవ్రమైన వాతావరణ సంఘటనలు, సప్లయ్ ఛైన్‌లో అనిశ్చితి, ఆర్థిక అస్థిరత వరకు వివిధ రకాల అంతరాయాలు.. పెరుగుదల, అభివృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి.. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ప్రపంచం వెనుకబడి ఉన్నప్పటికీ, రుణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సాంకేతికత గొప్ప వరమైనా కొత్త ఆందోళనలను కూడా పెంచుతుంది. ఈ సవాళ్లకు ఎస్సీఓ కూటమి ఎలా స్పందించాలి?’ అని ఆయన వ్యాఖ్యానించారు.


వృద్ధి, సంఘర్షణల నివారణకు బహుముఖ ప్రాంతీయ సహకారం అవసరాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. ‘కార్యకలాపాలను ఉగ్రవాదంతో ముడిపెడితే వాణిజ్యం ప్రోత్సహించడం, ప్రజల మధ్య సహకారం జరగదు’ అని జైశంకర్ అన్నారు. అంతకు ముందు మంగళవారం నాడు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీప్‌‌‌ను జైశంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. షాంఘై సహకార కూటమి సదస్సులో పాల్గొన్న సభ్యులకు పాక్ ప్రధాని విందు ఏర్పాటుచేశారు.


కాగా, ఈ సమావేశం అనంతరం జైశంకర్ మంత్రి ఎక్స్‌ (ట్విటర్) వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘ఇస్లామాబాద్‌లో జరిగిన ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సులో మన దేశం వాణిని వినిపించాను. కల్లోల ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు తగిన విధంగా ఎస్‌సీఓ స్పందించాలి’ అంటూ పలు మంత్రి అంశాలను ప్రస్తావించారు. కాగా, 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై పాక్ ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com