ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమవాసులకు చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్.. అక్కడే ఫిక్స్ చేశారుగా!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2024, 07:46 PM

ఆంధ్రప్రదేశ్ యువత కోసం చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతోంది. ఈ వర్శిటీనీ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తే బావుంటుందనే కసరత్తు చేస్తోంది. అయితే స్కిల్ యూనివర్శిటీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తిరుపతి జల్లా ఏర్పేడు మండలం కొబాక దగ్గర 50 ఎకరాల స్థలంలో వర్శిటీని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారట. అలాగే ఈ యూనివర్శిటీకి వర్సిటీకి ఛైర్మన్‌గా వ్యాపారవేత్తలను నియమించాలనే ఆలోచనలో ఉన్నారట.


గత ప్రభుత్వం స్కిల్ వర్సిటీ కోసం 50 ఎకరాలు కేటాయించింది.. కానీ అక్కడ ఎలాంటి నిర్మాణాలూ జరగలేదు. అందుకే ఏర్పేడు దగ్గర భూములు అందుబాటులో ఉండటంతో.. అక్కడ ఏర్పాటు చేయాలని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ నిర్ణయించినట్ల తెలుస్తోంది. ఈ స్కిల్ వర్శిటీకి ప్రముఖ వ్యాపారవేత్తలను ఛైర్మన్, కో ఛైర్మన్‌లుగా నియమిస్తే ఉపయోగకరంగా ఉంటుందని.. పరిశ్రమల ద్వారా విద్యా ప్రణాళిక రూపకల్పన, యువతకు అవసరమైన శిక్షణ అందించాలని ఆలోచన చేస్తున్నారట. ఈ స్కిల్ యూనివర్శిటీలకు అనుబంధంగా.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్ కాలేజీలను కూడా అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. ఈ వర్శిటీ, అనుబంధ కాలేజీల ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ, చదువుకుంటున్న యువతకు శిక్షణ ఇవ్వనున్నారు.


ఈ స్కిల్ యూనివర్శిటీ ద్వారా.. రాష్ట్రంలో మెగా పరిశ్రమల సొంత క్యాంపస్‌లు, మధ్యతరహా, చిన్న పరిశ్రమల నైపుణ్య శిక్షణ కేంద్రాలను భారీగా పెంచాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కిల్ శిక్షణ కేంద్రాలు 55 వరకు ఉండగా.. వాటిని 155కు పెంచబోతున్నారు. ఆయా పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అలాగే ఉపాధి అవకాశాలకు తగిన విధంగా కూడా శిక్షణ ఇస్తారు. అంతేకాదు ఇంటర్మీడియట్‌లోపు విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతకూ కూడా వారికి తగిన విధంగా శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి ఉత్పత్తి, సేవల రంగాల్లో శిక్షణ ఇస్తారు. అలాగే రాష్ట్రంలో నైపుణ్య గణన పూర్తయ్యాకి.. ఆ నివేదకల్ని పరిశీలించనుంది ప్రభుత్వం.


మరోవైపు రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్య పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా విద్యా ప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి నారా లోకేష్. ఆయన నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు లోకేష్. తమ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అందుకు తగిన విధంగా నైపుణ్యాభివృద్ధి విభాగం పనిచేయాలని సూచించారు.


రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, రక్షణ రంగాలు.. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా, పెట్రోకెమికల్స్.. ప్రకాశంలో బయోఫ్యుయెల్.. ఉమ్మడి అనంతపురంలో ఆటోమోటివ్.. కడప, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. అలాగే విదేశాల్లో బ్లూకాలర్‌ ఉద్యోగాలపై లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఈ ఉద్యోగాలకు మంచి డిమాండ్‌ ఉందని.. ఒక్క జపాన్‌లోనే 50 వేల మంది బ్లూకాలర్, నర్సింగ్‌ ఉద్యోగుల అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మంగళగిరిలో నిర్వహిస్తున్న నైపుణ్య గణనను ఈ నెలాఖరకు పూర్తి చేసి.. రాష్ట్రంలో కూడా గణన ప్రారంభించాలని సూచించారు. నైపుణ్య గణనకు సంబంధించిన డేటాను ఇన్ఫోసిస్‌ వంటి ప్రముఖ సంస్థలతో అనుసంధానించాలి అన్నారు. ఈ డేటా రాష్ట్రంలో కొత్తగా పెట్టబోయే పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడాలి అననారు. అంతేకాదు మంగళగిరిలో జెమ్స్‌-జ్యువెలరీ పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. విశాఖపట్నంలో ఏడెకరాల విస్తీర్ణంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com