ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరణం ఎందుకు ముఖ్యం?

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 11:53 AM

మరణం ఎందుకు ముఖ్యమైనది ? దాని ప్రాముఖ్యతను వివరించే  అందమైన కథనం. మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జనన మరణాలు సృష్టి నియమాలు..... విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే, మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు. ఎలా? ఈ కథ చదవండి...     ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి "ఓ స్వామీ! నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి" అని అడిగాడు. అప్పుడా సన్యాసి "ఓ రాజా ! దయచేసి మీరు ఎదురుగా వున్న రెండు పర్వతాలను దాటండి.అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు."అని చెప్పాడు.     రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి  వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా... 


  "నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటి వేశాడు.గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి వున్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను.అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను."   రాజు ఆలోచించాడు... "అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి ? నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే?" పరిష్కారం కోసం మళ్లీ సన్యాసి దగ్గరకెళ్ళి అడిగాడు. "నాకు అమరత్వంతో పాటు యవ్వనంకూడా లభించే మార్గం తెలుపండి "అని  సన్యాసి ఇలా అన్నాడు... "సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకుని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు.


   రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు.అక్కడ  అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే... కొందరు గట్టిగా అరస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు.నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈ మారు మూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. వారిలో ఒకరు "నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు..."నా కుడి వైపున మా నాన్న వున్నాడు. అతనికి 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి వున్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం  అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. 


రాజు దిగ్భ్రాంతికి గురై  సన్యాసి వద్దకు తిరిగి వచ్చి...
"మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినoదుకు ధన్యవాదాలు"* అన్నాడు. అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు.మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది.మరణాన్ని నివారించే బదులు,మీ ప్రతి రోజూ, ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అపుడు ప్రపంచం మారుతుంది. 


 


1.మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం (పవిత్ర స్నానం) లాగా ఉంటుంది. 


2. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది 


3. నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర  లాగా ఉంటుంది 


4. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహా ప్రసాదం అవుతుంది.


5. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర లాగా ఉంటుంది .


6. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది. 


7.ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com