ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో భారత్‌కే మా మద్దతు.. ఖలీస్థాన్‌ వేర్పాటువాదులకు కెనడా షాక్

national |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 09:41 PM

ఖలీస్థానీ వేర్పాటువాదులకు స్వర్గంగా భావించే కెనడాలో వారికి ఊహించని షాక్ తగిలింది. భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై తమకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని కెనడా స్పష్టం చేసింది. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం తమ విధానమని ఈ మేరకు కెనడా విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి డేవిడ్ మారిసన్ ప్రకటన చేశారు. గతేడాది ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న తర్వాత మొదటిసారి ఆ దేశం ఇలాంటి ప్రకటన చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ప్రకటనతో తాము ఖలీస్థాన్ పోరాటానికి మద్దతు ఇవ్వడం లేదనే చెప్పే ప్రయత్నం చేసింది. ఖలీస్థాన్ ఏర్పాటుకు మద్దతుగా 1980 దశకం నుంచి కెనడాలో జరుగుతోన్న ర్యాలీలపై మారిసన్‌‌ను మీడియా ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చారు.


‘ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్య్రం ఉంది.. దాని ఆధారంగానే ర్యాలీలు, నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించడం కెనడా విధానం మాత్రం కాదు.. భారతదేశ ప్రాదేశిక సమగ్రతను గౌరవించడంలో మా విధానం సుస్పష్టం.. భారత్ ఒకటే దేశం ఉంది.. అది చాలా స్పష్టం’ అని ఆయన బదులిచ్చారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి భారత్ విషయంలో కెనడా మళ్లీ సానుకూల ప్రకటనలు చేస్తోంది.


ఇటీవల ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో మాట్లాడుతూ. భారత్‌తో అంతర్జాతీయ భద్రత, కెనడా పౌరుల రక్షణ, చట్ట నిబంధనలు సహా చాలా ముఖ్యమైన అంశాలపై చర్చలు ప్రారంభించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గతేడాది నిజ్జర్ హత్య విషయంలో భారత్ ఏజెంట్ల పాత్ర గురించి తమకు సమాచారం ఉందంటూ కెనడా పార్లమెంటులో ట్రూడో చేసిన ప్రకటనపై తీవ్ర కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్.. నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మండిపడింది.


కెనడాలోని సీనియర్ దౌత్యాధికారిని తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించడం భారత్‌కు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. దీనికి తీవ్రంగా స్పందించిన భారత్.. కెనడా దౌత్యాధికారులను దేశం నుంచి వెళ్లగొట్టి. వీసాలపైనా ఆంక్షలు విధించింది. అలాగే, నిజ్జర్ హత్యకు ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంట్‌లో అతడికి నివాళులర్పించింది. అయితే, దీనికి బదులుగా భారత్ 1985లో ఖలీస్థాన్ ఉగ్రవాదులు ఎయిరిండియా ‘కనిష్క’ విమానాన్ని హైజాక్ చేసి బాంబులతో పేల్చివేసిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి వాంకోవర్‌లోని స్మృతివనం వద్ద నివాళి అర్పించి కౌంటర్ ఇచ్చింది.


ఈ ఘటనలో 329 మంది ప్రాణాలు కోల్పోగా.. ఎక్కువ కెనడా పౌరులే ఉన్నారు. కెనడా గడ్డపైనే హైజాక్ కుట్ర జరిగిందని.. ఆదే పాస్‌పోర్ట్ ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారులే నిందితులని భారత్ ప్రకటించినా.. ఇప్పటి వరకూ కెనడా దీనిపై విచారణ చేపట్టలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com