ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రహ్మోత్సవాలకు ముందు అపచారం జరిగిందా!.. టీటీడీ ఏం చెప్పిందంటే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 06:45 PM

తిరుమలలో అపచారం జరిగిందంటూ శుక్రవారం ఉదయం నుంచి సోషల్ మీడియా సహా కొన్ని మీడియాలలో వార్తలు వస్తున్న సంగతి శ్రీవారి భక్తులకు తెలిసిందే. తిరుమల శ్రీవారి ఆలయానికి ముందు ఉండే ధ్వజస్తంభంపై ఉన్న ఇనుప కొక్కెం విరిగిపడిందని ప్రచారం జరిగింది.. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. తొలిరోజు ధ్వజారోహణం నిర్వహిస్తారు. అయితే ధ్వజారోహణంలో భాగంగా ధ్వజస్తంభంపై గరుడ పఠాన్ని ఎగరేసే కొక్కీ విరిగిపోయిందని.. ఇది అపచారమంటూ వార్తలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. శ్రీవారి భక్తులు ఇలాంటి వదంతులు నమ్మవద్దని కోరింది. బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీనన్న టీటీడీ బోర్డు.. ఏ వస్తువులోనైనా తేడా ఉంటే వాటిని తొలగించి కొత్త వాటిని అమర్చడం సంప్రదాయమని చెప్పింది.


ఈ క్రమంలోనే శుక్రవారం కూడా.. ధ్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించారని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. పాత కొక్కీ స్థానంలో కొత్త దానిని ఏర్పాటు చేశారని.. అయితే అంతలోనే అపచారం జరిగినట్లుగా మీడియాలో ప్రసారం చేయడం దురదృష్టకరమని అభిప్రాయపడింది. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని, భక్తులు ఇలాంటి వదంతులు నమ్మవద్దని కోరుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ధ్వజారోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి..మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ శ్రీవారి సేవకులను నియమిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సారి నాలుగు వేల మందిని ఇందుకోసం ఆహ్వానించింది.


ఈ క్రమంలోనే శ్రీవారి సేవకులకు టీటీడీ ఈవో శ్యామలరావు పలు కీలక సూచనలు చేశారు. శ్రీవెంకటేశ్వరస్వామి అనుగ్రహం లేకుండా నాలుగు వేల మంది శ్రీవారి సేవకులుగా రావడం సాధ్యం కాదని ఈవో అన్నారు. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, లడ్డూ ప్రసాదాల పంపిణీ సమయంలో ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అలాగే శ్రీ‌వారి ఆలయం, కల్యాణకట్ట, బయటి ప్రదేశాల్లో క్యూలైన్ల నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.


వెంకటేశ్వరస్వామి అందించిన ఈ దివ్య అవకాశాన్ని వినియోగించుకొని.. శ్రీవారి సేవకులు అందరూ భక్తులకు నిబద్ధతతో సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు శ్రీవారి సేవకులుగా పనిచేసేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి స్వచ్ఛందంగా వస్తుంటారు. వారి సేవలకు గుర్తింపుగా టీటీడీ సుపథం ప్రవేశం ద్వారా వారికి శ్రీవారి దర్శన సౌకర్యం కల్పిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com