ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెజ్‌బొల్లాపై దాడుల్లో ఇజ్రాయెల్‌కు మరో షాక్.. ఒక్కరోజే 8 మంది సైనికులు మృతి

international |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 11:05 PM

లెబనాన్ భూభాగంలోకి చొరబడి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. లెబనాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేస్తుండగా.. హెజ్‌బొల్లా చేసిన ఎదురుదాడుల్లో ఒకేరోజు 8 మంది సైనికులను కోల్పోయింది. ఓవైపు ఇరాన్ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగి తమ దేశంపై క్షిపణుల వర్షం కురిపిస్తున్నా వెనక్కి తగ్గని ఇజ్రాయెల్.. తమ సైన్యాన్ని లెబనాన్‌లోకి పంపించింది. హెజ్‌బొల్లాను అంతం చేస్తామని ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు.. హెజ్‌బొల్లాతో భూతల దాడులు చేస్తామని ప్రకటించిన వేళ.. ఒకేరోజు భారీగా సైనికులు నేలకొరగడం ఇజ్రాయెల్‌‌కు మింగుడు పడటం లేదు.


ఇప్పటివరకు లెబనాన్‌లో ఉన్న హెజ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్.. బుధవారం సరిహద్దులు దాటి లోపలికి ప్రవేశించింది. ఈ క్రమంలోనే లెబనాన్ దళాలు ఇజ్రాయెల్ సైన్యంపై ఎదురుదాడికి దిగాయి. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ ఆర్మీ కెప్టెన్‌తో పాటు మరో ఏడుగురు జవాన్లు చనిపోయినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఆర్మీ కెప్టెన్ ఈటాన్ ఇట్జాక్ ఓస్టర్ నేలకొరకగా.. హెజ్‌బొల్లాతో చేస్తున్న దాడుల్లో ఇదే తొలి మరణం అని ఐడీఎఫ్ తెలిపింది. ఇక తాజాగా మరో ఏడుగురు సైనికులు కూడా చనిపోయినట్లు ప్రకటించింది. అయితే ఈ సైనికులు అంతా 20 నుంచి 25 ఏళ్లలోపు యువకులే అని పేర్కొంది.


లెబనాన్ దక్షిణ సరిహద్దు గ్రామంలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దళాలపై హెజ్‌బొల్లా మిలిటరీ చేసిన ఎదురుదాడుల్లో ఆ మరణాలు జరిగినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఈశాన్య సరిహద్దు గ్రామమైన అడేస్సేలోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ సైనికులు తీవ్ర ప్రయత్నాలు చేసి చివరికి వెనక్కి వెళ్లిపోయారు. కెప్టెన్ ఈటాన్ ఇట్జాక్ ఓస్టర్, కెప్టెన్ హరెల్ ఎటింగర్, కెప్టెన్ ఇటాయ్ ఏరియల్ గియాట్, సార్జెంట్ ఫస్ట్ క్లాస్ నోమ్ బార్జిలే, సార్జెంట్ ఫస్ట్ క్లాస్ ఆర్ మంత్జుర్, సార్జెంట్ ఫస్ట్ క్లాస్ నజార్ ఇట్కిన్, స్టాఫ్ సార్జెంట్ ఆల్మ్‌కెన్ టెరెఫ్ మరియు స్టాఫ్ సార్జెంట్ ఇడో బ్రోయర్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.


ఇక దక్షిణ లెబనాన్‌లోని అదనపు ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం బుధవారం పిలుపునిచ్చింది. దక్షిణ లెబనాన్‌లోని 20 గ్రామాలు, పట్టణాలను విడిచిపెట్టి వెళ్లాలని అక్కడ నివసిస్తున్న వారికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై భూతల దాడులు చేసేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్ సైన్యం.. లెబనాన్‌ భూభాగంలోకి సుమారు 400 మీటర్ల బ్లూలైన్‌లోకి ఇజ్రాయల్ దళాలు చేరుకున్నాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే వెనక్కి వెళ్లాయి.


లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని హెజ్‌బొల్లా హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ అధినేత హాసన్ నస్రల్లా మరణంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాసన్ నస్రల్లా మరణించడంతో ఇరాన్ మంగళవారం ప్రత్యక్ష యుద్ధంలోకి ప్రవేశించింది. ఇజ్రాయెల్‌ భూభాగంపై ఒకేసారి 180 క్షిపణులను ప్రయోగించి ఉక్కిరిబిక్కిరి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com