ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ భయంతోనే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష.. మాజీ మంత్రి రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 06:50 PM

ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిన రోజా.. రాజకీయాల్లో తిరిగి తన గొంతు వినిపిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అధికార ప్రతినిధిగా రోజా సెల్వమణి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుపతి లడ్డూ వివాదంపై రోజా స్పందించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరును ఎండగట్టారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో వచ్చిన వరదలు, జరిగిన అఘాయిత్యాలు, వైసీపీపై దాడులు, హామీల వైఫల్యం వంటి వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తిరుమల వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగారని రోజా ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.


మరోవైపు తిరుమల లడ్డూ గురించి చంద్రబాబు మరీ ఇంత దిగజారి మాట్లాడతారని ఊహించలేదన్న రోజా.. టీటీడీలో సీఎం జోక్యం ఉండదని నారా లోకేష్ స్వయంగా చెప్పారన్నారు. అలాంటిది ఈ వ్యవహారంలో వైఎస్ జగన్‌పై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ ఈవోగా జూన్ 21వ తేదీ శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారని రోజా చెప్పారు.జులై 6, జులై 12వ తేదీల్లో ట్యాంకర్లలో నెయ్యిని పరీక్షించారన్న రోజా.. జులై 23న వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ చేశారంటూ శ్యామలరావు ఆ ట్యాంకర్లను తిరస్కరించినట్లు చెప్పారన్నారు. అయితే రెండు నెలల తర్వాత తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందంటూ చంద్రబాబు ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు నిందల తర్వాత టీటీడీ ఈవోపై ఒత్తిడి తెచ్చి మరోసారి ప్రెస్ మీట్ పెట్టించారని రోజా ఆరోపించారు. మీ ప్రభుత్వంలో కల్తీ జరిగితే బాధ్యత ఎవరిదంటూ నారా లోకేష్‌ను ప్రశ్నించారు.


ఇదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షపైనా రోజా సెటైర్లు వేశారు. తప్పు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారన్న రోజా.. చంద్రబాబు చేస్తున్న తప్పుల భయం తనకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయంతోనే.. పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. తిరుమలలో వేయి కాళ్ల మండపం కూల్చివేత దగ్గర నుంచి ఎన్నో తప్పులు చేసిన చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఉపయోగం లేదని.. ఆయనను దేవుడు క్షమించడని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న 11 రోజుల దీక్ష ఆయనకు మాత్రమే పనికొస్తుందని రోజా అభిప్రాయపడ్డారు. తిరుమల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తే.. తిరుపతికి చెందిన వ్యక్తిగా చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com