కాకినాడ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ మహిళా రోగికి తెలుగు సినిమాను చూపించి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేస్తోంది. గుంటూరు జీజీహెచ్‌లో మొదటిసారి ఈ మాదిరి శస్త్రచికిత్స చేశామని సుమారుగా రెండున్నర గంటల పాటు సీనియర్ న్యూరో సర్జరీ, మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఈ శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, న్యూరోసర్జరీ విభాగం వైద్యులు తెలిపారు. విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొండంగి మండలం ఎ కొత్తపల్లికి చెందిన ఎ అనంతలక్ష్మి (55) అనే మహిళకు గత కొంతకాలంగా కుడి కాలు, చేయి లాగుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. అయితే అనంతలక్ష్మి తలలో పెద్ద కణితి ఉందని, నయం కావడం కష్టమని వైద్యులు తేల్చి తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 11న ఆమెకు ఉన్నట్టుండి తలనొప్పి రావడంతో పాటు మూర్ఛ, శరీరంలో కుడి భాగాలు పూర్తిగా మొద్దుబారి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్‌లో చేర్పించారు. వెంటరే వైద్యులు పరీక్షించి మెదడులో ఎడమవైపు 3.3×2.7 సెం.మీ.ల పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఆమెకు చాలా తక్కువ మోతాదులో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆమె మెలకువలో ఉండగానే శస్త్రచికిత్స చేసి దానిని తొలగించారు. అయితే ఆ శస్త్ర చికిత్స జరుగుతున్న సమయంలో అనంత లక్ష్మి తనకు ఇష్టమైన ‘అదుర్స్’ సినిమాలో జూ. ఎన్టీర్, బ్రహ్మానందం మధ్య వచ్చే హస్యపు సన్నివేశాలను చూస్తూ సంతోషిస్తూ ఉండగా డాక్టర్లు పేషెంట్‌కు నొప్పి తెలియకుండా ఆపరేషన్ పూర్తి చేశారు. అనంతరం అనంతలక్ష్మి లేచి కుర్చుని, అల్పాహారం తీసుకుందని, మరో ఐదు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని అప్పటివరకు వైద్యుల పర్య వేక్షణలోనే ఉంటుందని తెలిపారు.