ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాలీవుడ్ రేంజ్‌లో పాస్టర్‌ అరెస్ట్.. 2000 మంది పోలీసులు, హెలికాప్టర్లు, రాడార్లు

international |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 09:36 PM

స్వయం ప్రకటిత దేవుళ్లుగా చలామణి అయ్యేవారిని మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం. బాబాలు, పాస్టర్ల పేర్లతో తాము దేవుళ్లు పంపిన దూతలు అని.. తామే దేవుళ్లమని.. ప్రజలను నమ్మించి అడ్డంగా దోచుకునే దొంగల లోగుట్టు ఇప్పటికి ఎంతోమందిది బయటపడింది. అమాయక ప్రజలను మోసం చేస్తూ.. వారి నుంచి డబ్బులు దండుకుని.. ఒక సామ్రాజ్యమే ఏర్పాటు చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. భక్తి, దేవుడి ముసుగులో అక్రమ కార్యకలాపాలు సాగిస్తూనే ఉంటారు. డబ్బు, డ్రగ్స్, అమ్మాయిలు, ఆయుధాలు, ఉగ్రవాదులు.. ఇలా చట్టవ్యతిరేక పనుల్లో భారీగా డబ్బులు దండుకుంటూ ఉంటారు. ఇలాగే ఓ పాస్టర్ చేస్తున్న అరాచకాలను తట్టుకోలేని ప్రభుత్వం అతడ్ని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 2వారాలపాటు అనేక రకాల ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఫిలిప్పీన్స్‌లో చోటు చేసుకుంది.


ఫిలిప్పీన్స్‌లోని దావోవ్ నగరంలో తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని అనేక అరాచకాలకు పాల్పడుతున్న పాస్టర్ అపోలో క్విబోలాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విశ్వం మొత్తానికి తాను యజమానిని అని.. అంతేకాకుండా దేవుడు ఎంపిక చేసిన బిడ్డను అని ప్రకటించుకున్న అపోలో.. ఏకంగా ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ది కింగ్‌డమ్ ఆఫ్ జీసెస్ క్రైస్ట్ పేరుతో 75 ఎకరాల్లో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఇందులో 75వేల సీట్ల కెపాసిటీ ఉన్న ఒక భారీ స్టేడియంతోపాటు ఓ ప్రార్థనా మందిరం, మరో 40 బిల్డింగ్‌లు ఉన్నాయి. ఇక అతడికి 70 లక్షల మంది భక్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.


ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టోకు అపోలో క్విబోలాయ్ బాగా దగ్గరి వ్యక్తి. అంతేకాకుండా రోడ్రిగో డ్యూటెర్టోకు ఆధ్యాత్మిక సలహాదారుడిగా కూడా ఈ అపోలో క్విబోలాయ్ పనిచేశారు. అయితే రోడ్రిగో ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి అపోలోకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే 2021లో అపోలో క్విబోలాయ్‌పై అమెరికాలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ పలు అభియోగాలను మోపింది. చిన్న పిల్లలను సెక్స్‌ రాకెట్‌లోకి దింపడం.. ప్రజలను మోసం చేయడం.. భారీగా డబ్బును స్మగ్లింగ్‌ చేయడం వంటి అనేక కేసులను అపోలో క్విబోలాయ్‌పై మోపారు. ఫిలిప్పీన్స్‌ నుంచి అతడు బాలికలు, మహిళలను అమెరికాకు తరలిస్తున్నట్లు అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ పేర్కొంది. అంతేకాకుండా చారిటీ రూపంలో డబ్బును అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించింది. తన వ్యక్తిగత మహిళా సహాయకురాళ్లతో అతడు లైంగిక వాంఛలను తీర్చుకున్నట్లు కూడా అపోలో క్విబోలాయ్‌పై అనేక అభియోగాలు నమోదయ్యాయి.


ఈ నేపథ్యంలోనే అతడిపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాగైనా సరే అపోలో క్విబోలాయ్‌ని అరెస్ట్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏకంగా 2 వారాల పాటు సాగిన హైడ్రామా అనంతరం ఆదివారం అతడ్ని అరెస్ట్ చేశారు. ‘ది కింగ్‌డమ్‌ ఆఫ్‌ జీసెస్‌ క్రైస్ట్‌’ సామ్రాజ్యాన్ని దాదాపు 2వేలమంది పోలీసులు ముట్టడించారు. అది తెలుసుకున్న అపోలో మద్దతుదారులు.. దాని చుట్టూ ఒక కవచంలా ఏర్పడి భద్రతా దళాలు లోపలికి రాకుండా అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే 2 వారాలపాటు ఈ ఆపరేషన్‌ జరిగింది. ఈ క్రమంలోనే అపోలో క్విబోలాయ్.. ఆ ప్రాంగణంలోని ఓ బంకర్‌లో దాక్కున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌ను తీసుకువచ్చి.. అతడు భూమి లోపల ఉన్నట్లు గుర్తించారు.


ఈ క్రమంలోనే అపోలో నుంచి ప్రభుత్వానికి ఒక సమాచారం అందింది. తనతంట తానుగా ఆదివారం లొంగిపోతానని తన లాయర్‌ ద్వారా అపోలో అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే తన అరెస్ట్ వెనక దెయ్యం ఉందని అపోలో క్విబోలాయ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఎలాంటి ఘర్షణలు లేకుండా అపోలో లొంగిపోవడంతో పోలీసులు, ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com