ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు హామీ 24 గంటల్లోనే అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 10:27 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని 24 గంటల్లోనే నెరవేర్చారు. చంద్రబాబు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వానపల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. అక్కడ గ్రామసభలో పాల్గొన్న ఓ దివ్యాంగుడు, ఆర్థికంగా వెనుకబడ్డ మరో యువకుడు తమకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తే తమ జీవనోపాధికి, ఇతర పనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. వెంటనే స్పందించిన సానుకూలగా స్పందించిన చంద్రబాబు..తక్షణమే వారికి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.


 స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో అమలాపురం కలెక్టరేట్‌లో ఆ మరుసటి రోజునే సంగంపాలెంకు చెందిన దివ్యాంగుడు యిళ్ల భగవాన్‌, వాడపాలానికి చెందిన చింతపల్లి నాగమల్లేశ్వరకిరణ్‌కు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను కలెక్టర్‌ ఆర్‌.మహేశ్‌కుమార్‌ అందజేశారు. ఒక్కొక్క స్కూటర్ విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. తాము అడిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి.. తమకు ఎలక్ట్రిక్ స్కూటర్లు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


మరోవైపు ఆగస్టు 15న గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన స్థానికులతో ముచ్చటించారు.. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అయితే ఆ సభలో ఓ ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన మాటను రెండ్రోజుల్లోనే నెరవేర్చారు చంద్రబాబు. కృష్ణా జిల్లా వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రేమల్లి రజనీకాంత్‌తో ఆటో డ్రైవర్‌తో మాట్లాడగా.. ఎలక్ట్రిక్ ఆటో సమకూరుస్తానని ఆ సభలో హామీ ఇచ్చారు. సీఎం చెప్పారో లేదో.. ఆగస్టు 17న రజనీకాంత్‌ ఇంటి ముందు ఎలక్ట్రిక్‌ ఆటో ఉంది. ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో.. కలెక్టర్‌ డీకే బాలాజీ రూ.3.90 లక్షలు విలువైన అవే ఈసిటీ ఎలక్ట్రిక్ ఆటోను రజినీకాంత్‌కు అందజేశారు.


ఆ ఎలక్ట్రిక్‌ ఆటోను చూసి డ్రైవర్ రజనీకాంత్‌ ఆనందానికి అవధులు లేవు. గతంలో చంద్రబాబు పాలనా వేగం గురించి అందరూ చెప్తుంటే విన్నానని.. ఇప్పుడు తాను స్వయంగా చూశానని హర్షం వ్యక్తం చేశారు. తనకు, కుటుంబానికి ముఖ్యమంత్రి చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. గతంలో తాను డీజిల్ ఆటోను నడిపేవాడనని.. చంద్రబాబు డీజిల్ ఆటోను ఎలక్ట్రిక్ ఆటోగా మార్చే పద్ధతి గురించి అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. డీజిల్ ఖర్చు తగ్గించుకుని.. ఇలా ఎలక్ట్రిక్ ఆటోను నడపడం ద్వారా తన ఆదాయం కూడా పెరుగుతుందంటున్నారు. తాను ఎంతో లక్కీ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రజినీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 1న పర్యటించారు. స్థానికంగా పింఛన్ల పంపిణీ సందర్భంగా.. వృద్ధురాలు ఓబులమ్మ తనకు ఇల్లు లేదని మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన చంద్రబాబు.. ఆమెకు పక్కా ఇల్లు మంజూరు చేసి మాట నిలబెట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పట్టాను కూడా అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com