ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ తల్లుల మనసు ఎంత గొప్పది

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 10:40 PM

‘అమ్మ’లు ఈ ప్రపంచాన్ని ఏలితే, అప్పుడు ఎలాంటి విద్వేషాలు, యుద్ధాలు ఉండవు - అర్షద్ నదీమ్, నీరజ్ చోప్రాకు విషెస్ చెబుతూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఇది. ఒలింపిక్స్‌లో వీరిద్దరూ వరుసగా టాప్ 1, 2 స్థానాల్లో నిలిచి స్వర్ణ పతకం, రజత పతకం సాధించారు. అర్షద్ నదీమ్‌ది పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్. మన నీరజ్ చోప్రాది హర్యానాలోని పానిపట్ జిల్లా. ఒలింపిక్స్‌లో వీరిద్దరూ హోరాహోరీ తలపడటం ఇరు దేశాల అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. అంతర్జాతీయ వేదికల్లో భారత్ - పాకిస్థాన్ పరస్పరం తలపడితే, ఆ వోల్టేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్స్ రాత్రి ఒంటి గంట సమయంలో జరిగినా.. కోట్లాది మంది అభిమానులు టీవీ తెరలపై ఉత్కంఠగా వీక్షించారు.


  దాయాది దేశాల ఆటగాళ్లు తలపడటంతో ఫైనల్స్‌లో అర్షద్ నదీమ్, నీరజ్ చోప్రా మధ్య పోటీ గురించి క్రీడా ప్రపంచంలో ఉద్రేకమైన చర్చలు జరిగాయి. కానీ, వారిద్దరి మధ్య ప్రేమ తప్ప మరొకటి లేదు. టోక్యో ఒలింపిక్స్ సమయంలో నీరజ్ చోప్రా.. అర్షద్‌కు తన స్నేహ హస్తాన్ని అందించాడు. సాధన సమయంలో అతడికి సాయం చేశాడు. పతకాలు అందుకునే వేళ.. తన వద్ద దేశ పతాకం లేక ఇబ్బంది పడుతున్న అర్షద్‌ను గమనించి, తన వద్దకు పిలిచి భారత జాతీయ జెండా కింద ఆశ్రయమిచ్చాడు నీరజ్. అలా పాకిస్థానీయుల మనసులనే కాదు, యావత్ ప్రపంచాన్నీ గెలిచాడు.


తల్లిదండ్రుల నుంచే పిల్లలకు గొప్ప లక్షణాలు అలవడతాయి. నీరజ్ చోప్రా తల్లి మాటలు ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి. నీరజ్ చోప్రా గెలవాల్సిన స్వర్ణం.. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ గెలుచుకోవడంపై మీ స్పందన ఏంటని ఓ మీడియా ప్రతినిధి అడిగితే.. ‘అతడూ నా కొడుకు లాంటి వాడే’ అంటూ ఒక్క మాటతో తన ఉద్దేశాన్ని చెప్పారు నీరజ్ తల్లి సరోజ్ దేవి. ఇదే సమయంలో అర్షద్ తల్లి కూడా అదే భావాన్ని ప్రతిధ్వనించడం చెప్పుకోదగ్గ విషయం. తాను తన సొంత కొడుకును ఎలా చూస్తానో నీరజ్‌నూ అలాగే చూస్తానని అర్షద్ తల్లి రజా పర్వీన్ చెప్పారు.


‘అతడు కూడా (నీజజ్) నా కొడుకు లాంటివాడు. నదీమ్ స్నేహితుడే కాదు, అతడి సోదరుడు కూడా. గెలుపు ఓటములు ఆటలో భాగమే. అతడిపై దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి. అతడు మరిన్ని పతకాలు సాధించాలి. వారిద్దరూ సోదరుల లాంటివారు. నీరజ్ కోసం నేను కూడా ప్రార్థించాను. నదీమ్‌కు అందించిన మద్దతుకు, నా కొడుకు కోసం చేసిన ప్రార్థనలకు పాకిస్థాన్‌కు నేను కృతజ్ఞతలు చెబుతున్నా’ అని అర్షద్ నదీమ్ తల్లి అన్నారు.


ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడం కూడా తక్కువేమీ కాదని నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి అన్నారు. ‘నీరజ్‌ ప్రదర్శనపై గర్వంగా ఉంది. రజతంతో మేము చాలా సంతోషంగానే ఉన్నాం. స్వర్ణ పతకం సాధించిన క్రీడాకారుడు కూడా నాకు కొడుకు లాంటి వాడే. అందరూ అథ్లెట్లు పతకం సాధించడం కోసం చాలా కష్టపడతారు’ అని సరోజ్ దేవి అన్నారు. నీరజ్ సిల్వర్ మెడల్ గెలుచుకున్న తర్వాత ఖాండ్రా (పానిపట్ జిల్లా)లోని అతడి నివాసం సందడిగా మారింది. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ‘నీరజ్ ఇక్కడికి వచ్చాక.. అతడికి ఇష్టమైన ఆహారాన్ని వండిపెడతా’ అంటూ సరోజ్ దేవి తన అమ్మ మనసును చాటుకున్నారు.


స్వర్ణ పతకం విజయం తర్వాత అర్షద్ నదీమ్ ఇల్లు కూడా సందడిగా మారింది. ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ ఓ పతకం గెలుచుకోవడం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఆ విజయాన్ని అక్కడి వాళ్లు గర్వంగా భావిస్తున్నారు.


నదీమ్‌ది పంజాబ్ ప్రావిన్సులోని ఖనేవాల్ గ్రామం. అతడిని నిరుపేద కుటుంబం. తండ్రి మహ్మద్ అష్రాఫ్ తాపీ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఊరంతా చందాలు వేసుకొని నదీమ్‌కు శిక్షణ ఇప్పించారు. ప్రాక్టీస్ సమయంలో తగిన వసతులు లేక, సాధనాలు లేక, ప్రోత్సాహం లేక కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు నదీమ్.


జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో అర్షద్ నదీమ్ 92 మీటర్ల మార్క్‌ను తాకి సంచలనం సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్‌ చోప్రా ఈసారి 89.45 మీటర్లు విసిరాడు. తాజా ఈవెంట్‌లో స్వర్ణపతకం సాధించిన పాకిస్థాన్‌ ఆటగాడు అర్షద్ నదీమ్‌ను తన కుమారుడిగా సంబోధించడంపై సరోజ్ దేవిని ప్రశంసిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆమె క్రీడాస్ఫూర్తి కొనియాడారు. పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్‌ తర్వాత సోషల్ మీడియా ఇలాంటి సహృదయ కథలతో నిండిపోయింది.


ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో 92 మీటర్లతో సంచలనం నమోదు చేసిన పాకిస్థాన్ ఆటగాడు నదీమ్ అర్షద్ గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచాడు. నదీమ్ నేపథ్యం గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఢిల్లీ, కర్ణాటక, ఛండీగఢ్‌లో ఎక్కువ మంది నదీమ్ అర్షద్ గురించి సెర్చ్ చేస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com