ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో అల్లర్ల వెనుక పాక్ హస్తం ,,,,,షేక్ హసీనా కుమారుడు సంచలన వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 10:36 PM

బంగ్లాదేశ్‌లో అశాంతికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ( ఐఎస్ఐ) ఆజ్యం పోస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజేద్ జాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పునరుద్దరణ జరిగిన వెంటనే తన తల్లి హసీనా స్వదేశానికి తప్పకుండా వస్తారని జాయ్ ఉద్ఘాటించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజీబ్ జాయ్ మాట్లాడుతూ.. తన తల్లి రాజకీయాల్లో కొనసాగడం లేదా వైదొలగడం అనేది ఇంకా నిర్ణయించుకోలేదని వెల్లడించారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబం తమ ప్రజలను లేదా ఇబ్బందుల్లో ఉన్న అవామీ లీగ్‌ను వదలిపెట్టబోదని కూడా ఆయన నొక్కి చెప్పారు.


కష్టసమయంలో తన తల్లికి అండగా నిలిచిన భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి జాయ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అంతర్జాతీయ మద్దతు, ఒత్తిడిని పెంచడానికి భారత్ తనవంతు సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘అవును ఆమె (షేక్ హసీనా) బంగ్లాదేశ్‌లో తిరిగి అడుగుపెట్టరని చెప్పింది నిజం.. కానీ, గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కొనసాగుతోన్న దాడులతో మా ఆలోచన మారింది.. ప్రస్తుతం మేము మా ప్రజల భద్రత కోసం ఆలోచిస్తున్నాం.. మేము వారిని ఒంటరిగా వదిలి పెట్టి వెళ్లిపోము.. బంగ్లాదేశ్‌లో అతిపెద్ద పార్టీ అవామీ లీగ్.. కాబ్టటి మేము మా ప్రజలను దూరం చేసుకోలేం.. ప్రజాస్వామ్య పునరుద్దరణ జరిగిన తర్వాత తప్పకుండా ఆమె దేశంలో అడుగుపెడతారు’ అని తెలిపారు.


భారత్‌కు అవామీ లీగ్‌ను మంచి మిత్రుడిగా పేర్కొన్న జాయ్.. అంతర్జాతీయంగా ఒత్తిడిని పెంచడం ద్వారా బంగ్లాదేశ్‌లోని ఆ నాయకుల భద్రతను భారత్ నిర్ధారించాలని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో మహ్మద్ యూనస్ నాయకత్వంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం దేశంలో శాంతిభద్రతలను పునరుద్దరించాలని కోరారు. లేకుంటే అరాచకాలతో ఈ ప్రాంతంలో మరో అఫ్గనిస్థాన్‌గా మారిపోతుందని అన్నారు. ప్రజాస్వామ్యం పునరుద్ధరణతో ఎన్నికలు నిర్వహణకు మధ్యంతర ప్రభుత్వం శాంతియుత పరిస్థితులను సృష్టిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.


‘బంగ్లాదేశ్‌ ప్రజాస్వామ్యంలో అవామీ లీగ్‌ని ఎవరూ మినహాయించలేరు.. . ఆయన (మహమ్మద్ యూనస్) వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనప్పటికీ.. ఐక్యతతో కూడిన ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.. గత తప్పిదాలను భవిష్యత్తుపై ప్రభావం చూపకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను... ఆయన తన మాటకు కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాను’ అని జాయ్ పేర్కొన్నారు. ఇక, బ్రిటన్‌ సహా ఏ దేశాన్నీ హసీనా ఆశ్రయం కోరలేదని ఆయన పునరుద్ఘాటించారు. ఆమె వీసాను అమెరికా రద్దుచేసినట్టు వస్తున్న వార్తల్లోనూ నిజం లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com