ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు.. ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 07:35 PM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐఏఎస్ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చినందుకు ఐఏఎస్‌ అధికారి ఎన్‌.గుల్జార్‌ తీరును తప్పుబట్టింది. న్యాయపాలన, అధికార విభజనను ఉన్నతాధికారి అపహాస్యం చేశారని, కార్యనిర్వహణ వ్యవస్థకున్న లక్ష్మణరేఖను గుల్జార్‌ దాటారని పేర్కొంది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఏ వ్యక్తి అయినా కోర్టుధిక్కరణ బాధ్యులవుతారని తెలిపింది. కోర్టుపై ఆయనకు ఎలాంటి గౌరవం లేదని.. ప్రభుత్వ అధికారిగా కొనసాగేందుకు అనర్హుడని ఘాటుగా స్పందించింది. చట్టబద్ధ పాలన, అధికార విభజన సూత్రాలను అపహాస్యం చేశారని.. ఆయనను ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఎందుకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసు జారీచేసింది.


హైకోర్టు 2022 ఏప్రిల్‌ 11న ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినందుకు సుమోటో కోర్టు ధిక్కరణ కింద ప్రాసిక్యూట్‌ చేసి ఎందుకు శిక్షించకూడదో చెప్పాలని మరో షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. గుల్జార్‌పై సుమోటో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి నోటీసు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను మే 1కి వాయిదా వేసింది. కారుణ్య నియామకం కింద పిటిషనర్‌కు ఉద్యోగం కల్పించేందుకు నిరాకరిస్తూ గుల్జార్‌ 2022 జులై 5న జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పిటిషనర్‌ వినతిపై నాలుగు వారాల్లో తాజాగా ఉత్తర్వులు జారీచేయాలని ఆదేశించింది.


పశ్చిమగోదావరి జిల్లా తణుకు సర్కిల్‌లో ఏసీటీవో (సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి )గా పనిచేస్తూ బి.సరస్వతిదేవి 2018 ఫిబ్రవరిలో కన్నుమూశారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ఆమె చిన్నకుమారుడు బసవ శ్రీనివాస్‌ చేసిన అభ్యర్థనను అధికారులు 2018లో తిరస్కరించారు. పిటిషనర్‌ వయోపరిమితిని మించారని, పిటిషనర్‌ తండ్రి (మృతురాలి భర్త) ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొంది సర్వీసు పెన్షన్‌ పొందుతున్నారనే కారణాలను పేర్కొన్నారు. తన అభ్యర్థనను నిరాకరిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులపై 2021లో హైకోర్టును ఆశ్రయించారు.


ఈ పిటిషన్‌పై విచారణ చేసిన హైకోర్టు.. ఉద్యోగం నిరాకరిస్తూ అధికారులిచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. పిటిషనర్‌కు ఉద్యోగం కల్పించే అంశాన్ని తిరిగి పరిగణనలోకి తీసుకోవాలని 2022 ఏప్రిల్‌ 11న ఆదేశాలిచ్చింది. అధికారులు వాటిని అమలు చేయకపోవడంతో శ్రీనివాస్ మరోసారి‌ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అది విచారణలో ఉండగానే.. ఆర్థికశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి గుల్జార్‌ 2022 జులై 7న పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించారు. దీనిపై పిటిషనర్‌ హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. తల్లిదండ్రుల్లో ఎవరైనా సర్వీసు పెన్షన్‌ పొందితే కారుణ్య నియామకానికి కుటుంబ సభ్యులు అనర్హులని పేర్కొంటూ 2012 మార్చి 24నాటి ప్రభుత్వ సర్క్యులర్‌ను ఏపీఏటీ (పరిపాలన ట్రైబ్యునల్‌) 2018 ఫిబ్రవరి 28న కొట్టేసిందని గుర్తుచేశారు.


పిటిషనర్‌ వయసు విషయంలో అధికారుల వాదనను హైకోర్టు గతంలో తోసిపుచ్చిందని తెలిపారు. గతంలో ఏపీఏటీ, హైకోర్టు తప్పుపట్టిన అంశాలనే పరిగణనలోకి తీసుకొని పిటిషనర్‌ అభ్యర్థనను గుల్జార్‌ తిరస్కరించారని న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన ఉత్తర్వులు కోర్టు ఆదేశాలను ధిక్కరించేలా ఉన్నాయన్నారు. రాజ్యాంగబద్ధ పాలనపై గుల్జార్‌కు గౌరవం లేదని ఆక్షేపించారు. ప్రభుత్వ అధికారిగా ఆయన అన్‌ఫిట్‌ అని పేర్కొన్నారు. చట్టబద్ధ పాలనను అపహాస్యం చేశారన్నారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినవారు ధిక్కరణ కింద శిక్షార్హులని.. షోకాజ్‌ నోటీసులు జారీచేస్తూ వివరణ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com