తూర్పు భారతాన్ని కుతకుతలాడిస్తున్న వేడిగాలులు.. దక్షిణాది రాష్ట్రాలకు వ్యాపించినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు తెలిపింది. మంగళవారం అత్యధికంగా ఏపీలోని అనంతపురంలో 43.5 డిగ్రీలు, కర్నూలులో 43.2 డిగ్రీలు, తమిళనాడులోని సేలంలో 42.3 డిగ్రీలు, ఈరోడ్‌లో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో ఇలా వేడిగాలుల విజృంభించడం ఇది రెండోసారి.
తూర్పు భారతంలోని ఒడిశాలో ఏప్రిల్ 15 నుంచి, పశ్చిమ్ బెంగాల్‌లో 17 నుంచి వేడిగాలులు ఉద్ధృతం అయ్యాయి. దీంతో తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వేడిగాలులు మరో ఐదు రోజులు పాటు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే నాలుగైదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు వాయవ్య, తూర్పు ప్రాంతాల్లో 2 - 4 డిగ్రీల మేర, మహారాష్ట్రలో 3 - 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ్ బెంగాల్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, బిహార్, సిక్కిం, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మరో అయిదు రోజులు వేడిగాలుల నుంచి తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని పేర్కొంది.
తీరప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, అస్సాం, మేఘాలయ, త్రిపుర, బిహార్ రాష్ట్రాల్లో అధిక తేమతో ప్రజలు అసౌకర్యానికి గురవుతారని చెప్పింది. ఇక, ఒడిశాలో ఏప్రిల్ 25 నుంచి 27 తేదీల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటాయని ఐఎండీ వివరించింది.
అలాగే, సబ్-హిమాలయా పశ్చిమ బెంగాల్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.. దీనికి సమాంతరంగా ఉత్తరాన ఒక ద్రోణి, ఈశాన్య అసోం మీదుగా మరో అవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో పశ్చిమ్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, త్రిపురలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్ 29 వరకూ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.