గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై జరిగిన భౌతికదాడి గురించి ప్రస్తావించారు. వైఎస్ జగన్‌కి ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని పేర్కొన్నారు. కృష్ణంరాజు ఇంకా బతికే ఉన్నారని.. కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే గడిచాయని.. ప్రతి ఒక్కరికీ తమ గ్రహాలు కలిసొచ్చే సమయం తప్పకుండా వస్తుందని అన్నారు. తనకు కర్మసిద్ధాంతం మీద నమ్మకం ఉందన్న ఆయన.. మనిషి చేసే కర్మల వల్ల పాపం, పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్పారు. ఒక వ్యక్తిపై చెయ్యి ఎత్తడం అనేది చట్టానికి విరుద్ధమని.. రఘురామ కృష్ణంరాజు పట్ల వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జగన్‌కి, కృష్ణంరాజుపై చెయ్యెత్తిన వారికి చాలా సమయం ఉందని.. ఒకవేళ ఆ అధికారులు రిటైరనప్పటికీ ఇంకా భూమి మీదే బతికే ఉంటారని.. వాళ్లు చేసిన పనికి తగిన గుణపాఠం దక్కుతుందని పరోక్షంగా హెచ్చరించారు. ఒక ఎంపీని కొట్టడం అనేది చాలా అన్యాయం, ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు.