ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ నడినెత్తిన సూరీడు సుర్రుమనిసిస్తున్నాడు. భానుడి భగభగలతో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ఈ క్రమంలోనే ఏపీవాసులకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. గురువారం 54 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 154 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శుక్రవారం 36 మండలాల్లో తీవ్రవడగాల్పులు,157 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే బుధవారం 69 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 105 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు.
గురువారం విజయనగరం జిల్లాలోని 23 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 2 మండలాలు, అనకాపల్లి 3, పార్వతీపురం మన్యం జిల్లా 12, శ్రీకాకుళం జిల్లా 13, విశాఖపట్నం జిల్లాలోని ఒక మండలలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగానూ ఉష్ణోగ్రతలు క్రమంగా హాఫ్ సెంచరీకి చేరువగా వస్తున్నాయి. బుధవారం అత్యధికంగా విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45°C ఉష్ణోగ్రత నమోదైంది, వైఎస్ఆర్ జిల్లా బలపనూరులో 44.9°C, ప్రకాశం జిల్లా దొనకొండలో 44.3°C, నంద్యాల జిల్లా మహానందిలో 44.2°C, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.1°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తీవ్రవడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. ఎండలో గొడుగులేకుండా బయటకు రావద్దొని సూచించింది. నలుపురంగు దుస్తులు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదని సూచించింది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. మంచినీళ్లు తరుచుగా తాగుతూ ఉండాలని.. ఓఆర్ఎస్ వంటివి తీసుకుంటూ ఉండాలని సలహా ఇచ్చింది.